పథకాల అమలుపై అవగాహన తప్పనిసరి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: ‘మీరు గ్రామాల పాలకులు.. ప్రభుత్వం అమలు చేసే ప్రతి కార్యక్రమం గురించి మీకు తెలిసి ఉండాలి. సంక్షేమ పథకాల అమలుపై పూర్తిస్థాయిలో అవగాహన ఉండాలి. అప్పుడే ఆ ఫలాలు అర్హులకు అందుతాయి’ అని కలెక్టర్ స్మితా సబర్వాల్ సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మెదక్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులకు జీఓ 10లోని 25 అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల సమగ్రాభి వృద్ధికి సర్పంచ్‌లు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా వివిధ సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు గ్రామాల్లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నందున వాటిపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. స్కోర్ కార్డు అనే ప్రత్యేక వెబ్సైట్ ద్వారా గ్రామం ఏ ర్యాంకులో ఉందో తెలుసుకోవచ్చన్నారు. ఇతర గ్రామాల్లో అమలవుతున్న విధానాలను గుర్తించడంతోపాటు మన గ్రామంలోనూ ఎలాంటి చర్యలు చేపట్టవచ్చో తెలుసుకునేందుకు వీలుకలుగుతుందన్నారు.
వందశాతం వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే ప్రభుత్వం నిర్మల్ గ్రామంగా గుర్తించి రూ.20 లక్షలు విడుదల చేస్తుందన్నారు. ఈ నిధులతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చన్నారు. ఉపాధి హమీలో కూలీల సంఖ్యను పెంచాలని సూచించారు. ‘మార్పు’ కార్యక్రమం కింద ఎస్‌హెచ్‌జీ సమావేశాల్లో గర్భిణుల నమోదు, మాతాశిశు మరణాల రేటు తగ్గించడంలో సహకరించాలన్నారు. ఈ సదస్సులో జడ్పీ సీఈఓ ఆశీర్వాదం, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, హౌసింగ్ పీడీ బాల్‌రెడ్డి, డ్వామా పీడీ రవీందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.