దొంగ అనుకుని కూతుర్ని కాల్చేసింది...
వాషింగ్టన్: తనపై ఎవరో దాడికి యత్నిస్తున్నారని భావించి ఓ తల్లి జరిపిన కాల్పుల్లో ఆమె కూతురు(27) చనిపోయింది. అమెరికాలోని ఫ్లోరిడాలో రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సెయింట్ క్లౌడ్ పోలీస్ స్టేషన్ అధికారి డినైస్ రాబర్ట్స్ కథనం ప్రకారం... ఓ మహిళ నిద్రిస్తుండగా ఇంట్లోకి ఎవరో వచ్చారు. అయితే, దొంగ ప్రవేశించారన్న భావనతో తొందరపడి ఓ మహిళ ఫైరింగ్ చేసింది. అయితే, బుల్లెట్ తగిలి గాయపడ్డ యువతిని చూసి ఆ తల్లి కన్నీరుమున్నీరైంది. తన ముద్దుల తనయను తానే కాల్చి చంపాలనుకున్నానా అని ఆశ్చర్యానికి లోనైంది. వెంటనే తేరుకుని కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. కానీ ప్రయోజనం లేకపోయింది. అప్పటికే కూతురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
కాల్పులు జరిపిన సమయంలో ఆమె కాస్త నిద్రమత్తులో ఉందని, ఎవరో వస్తున్నట్లు చప్పుడైందని నిందితురాలు గుర్తించిందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తి ఎవరన్నది ఆమె పోల్చుకోలేక పోవడంతో పాటు తనకు దగ్గర్లో ఉన్న తుపాకీతో ఓ రౌండ్ కాల్పులు జరపింది. అనంతరం బుల్లెట్ గాయాలయిన యువతి దగ్గరికెళ్లి చూడగా ఆమె కాల్చించి తన కూతురేనని గ్రహించి వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లింది. కానీ, ఇంతలో జరగాల్సిన నష్టం జరిగిపోయిందని తెలుస్తోంది. అనుకోకుండా జరిపిన కాల్పులని, ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు రాబర్ట్స్ వివరించారు. మీడియా మిత్రులు యువతి తల్లిదండ్రుల పేర్లు ప్రచురించవద్దని కోరారు. ఆ యువతి తండ్రి గతంలో అండర్ కవర్ ఆఫీసర్గా చేశాడని, ఆమె తల్లి డిస్పాచింగ్ చేసే ఓ సంస్థలో పనిచేస్తుందని వెల్లడించారు.