ఇంక్యుబేటర్ బేబీ కష్టాలకు చెక్ చెప్పే 'యాప్'
తల్లి గర్భంలో ఉన్న పిల్లలు బయట నుంచి అమ్మ మాటలను, శబ్దాలను వింటూ హాయిగా బొజ్జుకుంటారట. ఆ మాటలు,శబ్దాలే గర్భంలో పెరిగే పిల్లలపై ఎంతో ప్రభావాన్ని చూపుతాయట. భారతంలో అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలోనే పద్మవ్యూహం గురించి అవగాహన చేసుకున్నాడని వర్ణించారు కూడా. ఇలా పిల్లల మెదడు చురుగ్గా పనిచేయడానికి, ఎదుగుదలకు తల్లి మాటలు ఎంతో సహాయపడతాయట. అయితే నెలలు నిండక ముందే పుట్టిన పిల్లలకు ఆ మాటలు వినడానికి అవకాశముండదు. వారిని సంరక్షించడానికి ఎక్కువ కాలం ఇంక్యుబేటర్ లోనే ఉంచుతారు. అమ్మ మాటలు ఆలకించడానికి వారికి ఛాన్స్ కూడా ఉండదు. వీరి కోసమే కొత్తగా రూపొందింది వాయిస్ ఆఫ్ లైఫ్ యాప్. టెక్ దిగ్గజం సామ్ సంగ్ ఈ యాప్ ను ఆవిష్కరించింది.
ఇంక్యుబేటర్ లో ఉన్న పిల్లలకు తల్లి మాటలను, హార్ట్ బీట్ ను వినిపించి, వారి బ్రెయిన్ ను డెవలప్ చేయడానికి ఈ యాప్ ఎక్కువగా ఉపయోగపడుతుంది. తల్లి హార్ట్ బీట్ ను, మాటలను ఆ యాప్ లో రికార్డు చేసి, ఇంక్యుబేటర్ లో ఉన్న పిల్లలకు వినిపించేలా దీన్ని డెవలప్ చేశారు. ఒకవేళ రికార్డు అయిన శబ్దాలలో ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే వాటిని ఈ యాప్ తొలగించి, ఇంక్యుబేటర్ లోపల ఉన్న పిల్లలకు వినిపించేలా సెట్ చేసింది సామ్ సంగ్ సంస్థ.
దీనివల్ల నెలలు నిండక ముందు పుట్టిన బేబీలు కూడా తల్లి మాటల వినే అనుభూతిని పొందుతారని హర్వర్డ్ మెడికల్ స్కూల్ పీడియాట్రిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అమిర్ లాహవ్ చెప్పారు. తల్లి గర్భానికి, ఇంక్యుబేటర్ వాతావరణం చాలా వేరుగా ఉంటుందని .. ఈ యాప్ ద్వారా పిల్లలు మెదడును ఆరోగ్యకరంగా రూపొందించవచ్చని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అయి, తల్లి గర్బంలో నుంచి బయటికి వచ్చిన పిల్లలకు భయం, ఆందోళనలు ఎక్కువగా ఉంటాయని,ఈ యాప్ ద్వారా వాటిని అధిగమించవచ్చని పేర్కొన్నారు.గతేడాది నెలలు నిండక ముందు జన్మించిన పిల్లలు దాదాపు 150 లక్షల పైమాటేనని ఆయన చెప్పారు. ఈ యాప్ ను రూపొందించడంలో డాక్టర్ అమిర్ శ్యామ్ సంగ్ కు ఎంతో కృషిచేశారు.