ప్రేమకు వెల కట్టిన పెద్దమనుషులు
మనస్తాపంతో యువతి ఆత్మహత్యాయత్నం
వర్ధన్నపేట టౌన్ : ప్రేమించినవాడు పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడమేగాక, పెద్దమనుషులు కూడా పంచాయతీలో ఆమెకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి క్రిమిసంహారక మందు తాగిన సంఘటన మండలంలోని డీసీ తండా శివారు గుబ్బెడ తండాలో శుక్రవారం జరిగింది. బాధితురాలు, తల్లిదండ్రుల కథనం ప్రకారం.. తండాకు చెందిన గుగులోతు రేణుక, అదే తండాకు చెందిన బానోతు మోతి ప్రేమించుకున్నారు. ఇటీవల మోతి ముఖం చాటేశాడు.
అతడిని నిలదీసిన ఫలితం లేకపోవడంతో రేణుక కుటుంబ సభ్యులు పెద్దమనుషులను ఆశ్రయించారు. వారు కూడా పెళ్లికి బదులుగా ఆమెకు రూ.40 వేలు నష్టపరిహారం ఇవ్వాలని, పెద్ద మనుషులకు ఖర్చల కోసం రూ.10 వేలు ఇవ్వాలని తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో తీవ్ర మనస్తాపానికి గురైన రేణుక శుక్రవారం ఇంట్లో క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వర్ధన్నపేట ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.