ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చా...
పోలీసు వ్యవస్థలో మార్పులు తెచ్చా దినేశ్‌రెడ్డి వెల్లడి
మోతీనగర్, న్యూస్‌లైన్: నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకొచ్చానని, పోలీసు వ్యవస్థలో తాను డీజీపీగా ఉన్నప్పుడు అనేక మార్పులు తెచ్చానని వైఎస్సార్సీపీ మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి దినేష్‌రెడ్డి వెల్లడించారు. రాజన్న రాజ్యంతోనే ఇరు రాష్ట్రాలవారు సుఖసంతోషాలతో ఉంటారని స్పష్టంచేశారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మోతీనగర్ అల్లాపూర్ ప్రధానమార్గంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభం,....
ఆయా ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. గత పాలకులు పదవులను కాపాడుకోవడంలోనే నిమగ్నమయ్యారని విమర్శించారు. కూకట్పల్లి ఎమ్మెల్యే అభ్యర్థి జంపన ప్రతాప్ మాట్లాడుతూ పాలకుల నిర్లక్ష్యం వల్ల కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడిపోయిందన్నారు. సీనియర్ నాయకుడు సత్యంశ్రీరాంగం మాట్లాడుతూ జగన్‌ను నేటియువకులు ఆదర్శంగా తీసుకొని రాజకీయాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.
మహానేత పథకాలతోనే గెలుపు
మలేసియాటౌన్‌షిప్/కుత్బుల్లాపూర్:మహానేత వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తాయని దినేశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేపీహెచ్‌బీ కాలనీలో జరిగిన రోడ్‌షోలో ఆయన పార్టీ కూకట్పల్లి అభ్యర్థి జంపన ప్రతాప్‌తో కలిసి మాట్లాడారు. నిస్వార్థంగా సేవ చేస్తానని.. ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. జగన్‌తోనే అభివృద్ధి సాధ్యమంటూ..రెండు రాష్ట్రాల్లోనూ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
సుస్థిర పాలనకే పట్టం కట్టండి : సుస్థిరపాలన రావాలంటే వైఎస్సార్సీపీకే పట్టంకట్టాలని దినేష్‌రెడ్డి పిలుపునిచ్చారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి కొలన్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి బుధవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో పార్టీ కార్యాలయాలు ప్రారంభించి ఆయన మాట్లాడారు.
దేశంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న మల్కాజిగిరి నుంచి తనకు అవకాశమిస్తే ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తానని హామీఇచ్చారు. ఏ ప్రాంతానికి వెళ్లినా ప్రజలు చూపుతున్న ఆదరణ తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని, ఇలాగే కొనసాగితే గెలుపు సునాయసమని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం షాపూర్‌నగర్ చౌరస్తాలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.