హైదరాబాద్ లో మోటోప్లెక్స్ ఔట్లెట్..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ పియాజియో ఇండియా దక్షిణాదిన తొలి రిటైల్ స్టోర్ మోటోప్లెక్స్ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. శ్రేయ్ ఆటోమోటివ్స్ జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-36లో 4,134 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని నెలకొల్పింది. సినీ హీరో అక్కినేని చైతన్య చేతుల మీదుగా గురువారం ప్రారంభించింది. భారత్‌లో కంపెనీకి ఇది రెండవ స్టోర్. తొలి ఔట్‌లెట్‌ను పుణేలో 2015 నవంబర్‌లో ప్రారంభించారు.
పియాజియోకు చెందిన ప్రీమియం ఇటాలియన్ బ్రాండ్స్ అయిన అప్రీలియా, మోటో గుజ్జి, వెస్పా బ్రాండ్ ద్విచక్ర వాహనాలను ఇక్కడ విక్రయిస్తారు. అలాగే యాక్సెసరీస్ కొలువుదీరాయి. డిసెంబర్‌కల్లా మరో అయిదు మోటోప్లెక్స్ స్టోర్లు నెలకొల్పుతామని పియాజియో ఎండీ, సీఈవో స్టీఫానో పెల్లె ఈ సందర్భంగా మీడియాకు తెలిపారు. కస్టమర్లకు వినూత్న అనుభూతి కలిగించేందుకు మోటోప్లెక్స్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చామన్నారు. కార్యక్రమంలో శ్రేయ్ ఆటోమోటివ్స్ సీఈవో సుశీల్ దుగ్గార్ పాల్గొన్నారు.