కన్నతండ్రే కాలయముడయ్యాడా..!
గొల్లపల్లి: కన్నతండ్రే కాలయముడిగా మారి కుమార్తెను హతమార్చాడా..? సవతి తల్లి పాత్ర కూడా ఇందులో ఉందా...? అన్నీ సాఫీగా జరిగి ఉండి ఉంటే పెళ్లి చేసుకుని నూతన జీవితంలోకి అడుగుపెట్టాల్సిన ఓ యువతి... తెల్లారే సరికి శవమై కనిపించడం వెనుక ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ జిల్లా గొల్లపల్లి మండలం వెన్గుమట్ల గ్రామంలో బుధవారం తెల్లవారుజామున ఓ యువతి అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెన్గుమట్ల గ్రామానికి చెందిన పాట్కూరి సత్యనారాయణరెడ్డి, ప్రేమలతలకు 30 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి మౌనశ్రీ (23) అనే కూతురు ఉంది.
మనస్పర్థలు రావడంతో ప్రేమలత-సత్యనారాయణరెడ్డిలు 20 ఏళ్ల క్రితమే విడిపోయారు. అనంతరం సత్యనారాయణరెడ్డి లత అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మూడేళ్ల క్రితం వెటర్నరి డిప్లోమా పూర్తిచేసిన మౌనశ్రీ కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తోంది. మౌనశ్రీ వివాహం బాధ్యత సత్యనారాయణరెడ్డిపై ఉండటంతో అతను కొంత కాలంగా సంబంధాలు చూస్తున్నారు. ఈ క్రమంలో మౌనశ్రీకి కరీంనగర్లో ఓ సంబంధం చూడగా కుదిరింది. వివాహం గురించి మాట్లాడటానికి రావాలంటూ మంగళవారం సత్యనారాయణరెడ్డి మిత్రుడితో మౌనశ్రీకి ఫోన్ చేయించాడు. తండ్రి పిలుపునందుకున్న మౌనశ్రీ మంగళవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో వెన్గుమట్లకు చేరుకుంది. భోజనం చేసిన అనంతరం రాత్రి ఇంట్లోనే నిద్రించింది. బుధవారం ఉదయం చూసేసరికి మౌనశ్రీ మృతి చెంది కన్పించింది.
విషయం తెలుసుకున్న ప్రేమలత వెన్గుమట్లకు చేరుకుని కన్నీరు మున్నీరుగా రోదించింది. రూ. 25 లక్షల కట్నం ఇచ్చి వివాహం జరిపించాల్సి వస్తుందన్న కోపంతోనే కుమార్తెను పథకం ప్రకారం పిలిపించుకుని హతమార్చారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. మంగళవారం సాయంత్రం వెన్గుమట్లకు చేరుకున్న మౌనశ్రీ టీ తాగిన కొద్దిసేపటికే ఫోన్ చేసి మత్తుగా ఉందని తనతో చెప్పిందని ఆమె తల్లి ప్రేమలత పేర్కొంది. దీంతో మౌనశ్రీ మృతి వెనుక ఆమె తండ్రి, అతని బంధువుల పాత్ర ఉండి ఉండవచ్చనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.