ఎర్రమట్టి దుమారం
► మట్టి తరలింపును అడ్డుకున్న
► గాజులపల్లెవాసులు
► ఉద్రిక్తత కు దారితీసిన వివాదం
గాజులపల్లె(మహానంది): గాజులపల్లె సమీపంలోని అంకిరెడ్డి చెరువు నుంచి ఎర్రమట్టి తరలింపు తతంగం గురువారం వివాదానికి దారి తీసింది. అధికారపార్టీ నేతలు మట్టి తరలిస్తుండగా గాజులపల్లె గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్కడున్న ప్రొక్లెయిన్లు, టిప్పర్, ఇతర వాహనాలను చెరువు నుంచి బయటకు పంపించడంతో అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఇటుకల బట్టీలు, ఇతర అవసరాల నిమిత్తం అంకిరెడ్డి చెరువు నుంచి కొందరు కొన్ని రోజులుగా ఎర్రమట్టి తరలిస్తున్నారు.
అయితే గ్రామస్తుల ఫిర్యాదు మేరకు భూగర్భ, రెవెన్యూ, పోలీసు అధికారులు అడ్డుకోవడంతో మూడు నాలుగురోజులుగా తరలింపు ఆగింది. తర్వాత మళ్లీ మొదలు కావడంతో గురువారం గాజులపల్లె గ్రామానికి చెందిన కొందరు అధికార పార్టీ నాయకులు, ప్రజలు సుమారు వందమంది వరకు వెళ్లి మట్టి తరలింపును అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మట్టి తరలింపు వల్ల చెరువుకు గండ్లు పడతాయని, అదే జరిగితే పొలాలకు సాగునీటి కొరత ఏర్పడుతుంద ని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. విషయంపై నీటి పారుదల శాఖ అధికారులు సుధాకర్, రామ్మోహన్‌కు ఫిర్యాదు చేశామని గ్రామస్థులు, చెరువు సంఘం అధ్యక్షుడు పెద్ద హుసేని, రైతులు తెలిపారు. శ్రీశైలం నియోజకవర్గంలోని టీడీపీ ముఖ్యనేత, ఆయన బంధువులు, నంద్యాల నియోజకవర్గానికి చెందిన నేతల మధ్య ఉన్న విభేదాలే ఎర్రమట్టి తరలింపు వివాదానికి కాారణమన్న చర్చ సాగుతోంది.