కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి - ఎంపీ బుట్టా రేణుక
కర్నూలు(అర్బన్): పార్లమెంట్ రైల్వే బడ్జెట్ సమావేశాల్లో కర్నూలు- మంత్రాలయం రైల్వే లైన్ ఏర్పాటు చేసేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక చెప్పారు. శనివారం సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఇటీవల విజయవాడలో జరిగిన పార్లమెంట్ సభ్యుల సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులు రూపొందించిన జాబితాలో కర్నూలు- మంత్రాలయం లైన్ లేకపోవడం తనకు ఎంతో బాధ కలిగించిందన్నారు.
అయితే 2012లో ఈ లైన్ ఏర్పాటుకు సంబంధించి సర్వే రిపోర్టును కూడా అందించిన విషయాన్ని కేంద్ర రైల్వే శాఖా మంత్రి సురేష్ ప్రభు దృష్టికి తీసుకుపోనున్నట్లు చెప్పారు. ఇప్పటికే సంబంధిత మంత్రికి లేఖ కూడా రాశానన్నారు. రైల్వే లైన్ ఏర్పాటుకు అవసరమయ్యే బడ్జెట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం భరించాలని, అలాగే లైన్‌కు అవసరమయ్యే భూమిని ప్రభుత్వం ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబును ప్రత్యేకంగా కలిసేందుకు సమయాన్ని కోరనున్నట్లు చెప్పారు.
కోచ్ ఫ్యాక్టరీ నిధులు వెనక్కి వెళ్లాయి...
కర్నూలు సమీపంలో ఏర్పాటు చేయాలనుకున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిధులు వెనక్కు వెళ్లాయని ఎంపీ చెప్పారు. కోచ్ ఫ్యాక్టరీకి అవసరమైన భూములను సేకరించడంలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికైనా భూములను సేకరిస్తే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వే జీఎం చెబుతున్నారని ఆమె స్పష్టం చేశారు. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటైతే జిల్లాలోని ఎంతో మంది యువతకు ఉపాధి అవకాశాలు లభించేవన్నారు. నిరుద్యోగ సమస్య తీరాలంటే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు కావాల్సి ఉందన్నారు. రైల్వే క్రాసింగుల వద్ద బ్రిడ్జిలు నిర్మించే అంశాన్ని కూడా బడ్జెట్ సమావేశాల్లో సభ దృష్టికి తీసుకుపోతానన్నారు.
విభజన అనంతరం కర్నూలుకు తగ్గిన ప్రాధాన్యం
రాష్ట్రం విడిపోయిన అనంతరం కర్నూలు జిల్లాకు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోతున్నదని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా పరంగా జిల్లాను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందన్నారు. కేంద్రంలో తాను చేస్తున్న కృషికి రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా సహకారాన్ని అందించాలని కోరారు. ముఖ్యంగా కర్నూలు పార్లమెంట్ పరిధిలో తాగు, సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. పార్లమెంటరీ గ్రామీణాభివృద్ధి కమిటీలో తాను మెంబర్ కావడం వల్ల కూడా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపట్టేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.