లిఫ్టులో ఇరుక్కుపోయిన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే
చెన్నై: తమిళనాడులోని తిరువారూరులో మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీలు లిప్టులో ఇరుక్కుపోవటం కలకలం రేపింది. నాగపట్నంలో చేపల విక్రయానికి సంబంధించి ఆదివారం ఇరు గ్రామాల జాలర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఇందులో 27 మంది గాయపడ్డారు. వీరందరినీ నాగపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. అనంతరం మెరుగైన చికిత్సల నిమిత్తం ఏడుగురిని తిరువారూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. వీరంతా రెండో అంతస్తులో చికిత్స పొందుతున్నారు.
జాలర్లను పరామర్శించేందుకు రాష్ట్ర మంత్రి ఓఎస్ మణియన్, ఎంపీ గోపాల్, ఎమ్మెల్యే తమిమున్ అన్సారి, మాజీ మంత్రి జీవానందం సోమవారం ఉదయం తిరువారూరు ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లారు. వారిని డీన్ మీనాక్షి సుందరం, అన్నాడీఎంకే నగర కార్యదర్శి మూర్తి లిఫ్టులో తీసుకువెళ్లారు. ఆ సమయంలో లిఫ్టు మొదటి, రెండో అంతస్తు మధ్యలో నిలిచిపోయింది. పోలీసులు వెంటనే అక్కడికి వచ్చి అతికష్టం మీద లిఫ్టును మొదటి అంతస్తుకు తీసుకువచ్చారు. అరగంట సేపు నానా తంటాలు పడి తలుపులు పగులగొట్టి అందరినీ సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.