చివర్లో లాభాల గోల్
331 పాయింట్ల హైజంప్
25,521కు ఎగసిన సెన్సెక్స్
నిఫ్టీ 98 పాయింట్లు ప్లస్
రెండు వారాల్లో గరిష్ట లాభం
ఇరాక్ యుద్ధ భయాలు కొనసాగుతున్నప్పటికీ దేశీ స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకున్నాయి. చివరి గంటన్నరలో ఊపందుకున్న కొనుగోళ్లతో హైజంప్ చేశాయి. వెరసి సెన్సెక్స్ 331 పాయింట్లు ఎగసి 25,521 వద్ద నిలిచింది. ఇది గత రెండు వారాల్లోనే అత్యధిక లాభంకాగా, నిఫ్టీ కూడా 98 పాయింట్లు పుంజుకుని 7,632 వద్ద ముగిసింది. సెన్సెక్స్ ఇంతక్రితం ఈ నెల 6న మాత్రమే ఈ స్థాయిలో 377 పాయింట్లు లాభపడింది.
గత రెండు రోజుల నష్టాలను తలపిస్తూ తొలుత అమ్మకాలు కొనసాగాయి. దీంతో సెన్సెక్స్ మిడ్ సెషన్లో 25,104 పాయింట్ల వద్ద కనిష్ట స్థాయిని తాకింది. ఆపై నెమ్మదిగా కోలుకుంటూ వచ్చింది. మధ్యాహ్నం రెండు తరువాత అన్ని వర్గాల నుంచీ కొనుగోళ్లు పెరగడంతో భారీ లాభాలతో దూసుకెళ్లింది. ఒక దశలో గరిష్టంగా 25,546 పాయింట్ల వరకూ ఎగసింది. చివరికి అదే స్థాయిలో స్ధిరపడింది. గత రెండు రోజుల్లో సెన్సెక్స్ 386 పాయింట్లు పతనమైన విషయం విదితమే. బీఎస్ఈలో దాదాపు అన్ని రంగాలూ లాభపడగా ఆయిల్, బ్యాంకింగ్, క్యాపిటల్ గూడ్స్, పవర్, మెటల్ 3-1.5% మధ్య పురోగమించాయి.
ఆయిల్ షేర్ల జోష్
అంతర్జాతీయ స్థాయిలో చమురు ధరలు తగ్గడంతో ఆయిల్ షేర్లు ఓఎన్జీసీ, ఐవోసీ, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్, గెయిల్, ఆర్ఐఎల్ 4-2.5% మధ్య పుంజుకున్నాయి.
బ్యాంకింగ్ ఓకే
బ్యాంకింగ్ దిగ్గజాలు యాక్సిస్, ఎస్బీఐ, ఐసీఐసీఐ 4-2.5% మధ్యలో పురోగమించగా, ఫెడరల్ బ్యాంక్, బీవోఐ, పీఎన్బీ, ఇండస్ఇండ్, బీవోబీ, కెనరా, యస్ బ్యాంక్ సైతం 5-3% మధ్య ఎగశాయి.
బ్లూచిప్స్ జోరు
ఇతర బ్లూచిప్స్‌లో కోల్ ఇండియా, భెల్, సెసాస్టెరిలైట్, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, భారతీ, మారుతీ 3-2% మధ్య లాభపడ్డాయి.
ఆరు మాత్రమే : సెన్సెక్స్లోఎంఅండ్ఎం, హీరోమోటో, డాక్టర్ రెడ్డీస్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో 1.5-0.5% మధ్య క్షీణించగా, సిప్లా నామమాత్రంగా నష్టపోయింది.
చిన్న షేర్ల దూకుడు
సెంటిమెంట్‌కు అనుగుణంగా మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్‌లు 2% స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో ఏకంగా 2,046 లాభపడితే, 953 మాత్రమే నష్టపోయాయి.
బీఎస్ఈ-500 పరుగు
బీఎస్ఈ-500లో భాగమైన జేపీ ఇన్ఫ్రా, సియట్, హెచ్ఎంటీ, వ్యాబ్కో, చంబల్, సింటెక్స్, ఆర్సీఎఫ్, స్టెరిలైట్ టెక్, ఫ్యూచర్ లైఫ్‌స్టైల్, మోతీలాల్ ఓస్వాల్, ఎంటీఎన్ఎల్, జేకే లక్ష్మీ సిమెంట్, ఐఆర్బీ ఇన్ఫ్రా, గృహ్ ఫైనాన్స్ తదితరాలు 13-7% మధ్య దూసుకెళ్లాయి.