పడక
ఏళ్ల తరబడి బదిలీలు లేవు.. కొన్నిచోట్ల అసలే లేరు.. ఉన్నచోట్ల అతుక్కుపోయి కూర్చున్నారు.. మండల స్థాయిలో పాలన వ్యవస్థను గాడినపెట్టే మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ)ల తీరిదీ.
స్తంభిస్తున్న మండలాభివృద్ధి
- పాతుకుపోయిన ఎంపీడీఓలు
- ఆరేళ్లుగా బదిలీల ఊసేలేదు..
- దీర్ఘకాలంగా ఒకేచోట పలువురు
- 14 మండలాల్లో అధికారులే లేరు
- గాడి తప్పుతున్న పాలన
- పనులు నత్తనడక
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలో ఆరేళ్లుగా ఎంపీడీవోల బదిలీలు అటకెక్కాయి. పలువురు అధికారులు ఒకే మండలంలో ఏళ్ల తరబడి సీటును అంటిపెట్టుకుని ఉండిపోయారు. దీంతో అవినీతి పెరుగుతుండటంతో పాటు ఎంపీపీ అభివృద్ధి కార్యాలయాల్లో పాలన గాడితప్పుతోంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా 14 మండలాల్లో ఇన్చార్జీల పాలన కొనసాగుతోంది. ఇక్కడ ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులు నత్తనడక నడుస్తున్నాయి.
నడిపించే వారేరీ?
రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న నేపథ్యంలో మండల స్థాయిలో సమర్థులైన అధికారులు కరువయ్యారు. దీంతో ఆయా పథకాల ఫలాలు క్షేత్రస్థాయికి చేరటం లేదన్న విమర్శలున్నాయి. జవాబుదారీతనం లేక ఇష్టారాజ్యంగా పనిచేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఇటీవల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యహరించిన ఇద్దరు ఎంపీడీవోలపై కలెక్టర్ రోనాల్డ్‌రాస్ సస్పెన్షన్ వేటు వేశారు. మండల స్థాయిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన ఎంపీడీఓల వ్యవస్థ సక్రమంగా లేనందున వెంటనే బదిలీ లు చేపట్టి వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. ఎంపీడీఓల పని తీరుపై ఎమ్మెల్యేలూ అసంతృప్తితో ఉన్నారు.
ఏళ్ల తరబడి ఒకేచోట విధులు
జిల్లా వ్యాప్తంగా 46 మంది ఎంపీడీవోలు ఉండ గా 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 32 చోట్ల పూ ర్తిస్థాయి ఎంపీడీవోలు పనిచేస్తున్నారు. వీరిలో 23 మంది సుదీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్నారు. అధికారుల సమాచారం ప్రకారం రేగో డ్, వెల్దుర్తి, రాయికోడ్, ములుగు, జిన్నారం, న ర్సాపూర్, ఝరాసంగం, ఆర్సీపురం, గజ్వేల్, తూప్రాన్, మెదక్, అల్లాదుర్గం, చిన్నకోడూరు ఎంపీడీవోలు ఐదారేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్నా రు. తొగుట, శివ్వంపేట, టేక్మాల్, కల్హేర్, కొం డాపూర్, న్యాల్కల్, పెద్దశంకరంపేట, కొల్చా రం ఎంపీడీవోలు 3-4 ఏళ్లుగా ఉన్నచోట పనిచేస్తున్నారు. బదిలీల షెడ్యూల్ విడుదలలో జా ప్యం కారణంగా వీరంతా దీర్ఘకాలికంగా ఒకేచో ట పనిచేస్తున్నారు. దీనివల్ల అవినీతికి ఆస్కారంతో పాటు పాలనలో నిర్లక్ష్య ధోరణలు కనిపిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి.
ఇన్చార్జీల పాలనతో ఇబ్బందులు
జిల్లాలోని దౌల్తాబాద్, కంగ్టి, మనూరు, నారాయణఖేడ్, పుల్కల్, దుబ్బాక, నంగనూరు, చిన్నశంకరంపేట, పాపన్నపేట, జగదేవ్‌పూర్, సంగారెడ్డి, హత్నూర, సదాశివపేట, కోహీర్ మండలాల్లో ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. ఆయా చోట్ల ఇన్చార్జీ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. వీరు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల పలు పనులు పెండింగ్‌లో పడుతున్నాయి.