'అది నీ సినిమా అని ఎలా చెప్పుకుంటావ్?'
మిస్టర్ ఇండియా సినిమాకు బాలీవుడ్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. 1987లో రిలీజైన 'మిస్టర్ ఇండియా' అప్పట్లో బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా శేఖర్ కపూర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కథను సలీమ్-జావేద్ అక్తర్‌లు అందించారు. తాజాగా ఈ సినిమాను మిస్టర్ ఇండియా 2గా తీయాలని 'టైగర్ జిందా హై' ఫేమ్, దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ రీమేక్‌గా తెరకెక్కించాలని భావిస్తున్నాడు. ఇదే విషయాన్ని అబ్బాస్ తన ట్విటర్లో వెల్లడిస్తూ.. ' మిస్టర్ ఇండియా సినిమా కోసం పనిచేయడం నాకెంతో సంతోషంగా అనిపించింది. ప్రతి ఒక్కరి చేత ప్రశంసలందుకున్న ఐకానిక్ పాత్రలను మరోసారి మీ ముందుకు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాను. అయితే ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నా.. నటీనటులు ఎవరనేది ఇంకా ఏం నిర్ణయించలేదు' అని పేర్కొన్నారు. (‘అమృతగా తాప్సీ నన్ను ఆకట్టుకుంది’)
అయితే మిస్టర్ ఇండియా సినిమాలో హీరోగా నటించిన అనిల్ కపూర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్‌ను సంప్రదించకుండా రీమేక్ ఎలా తీస్తారంటూ నటి, అనిల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. వారి అనుమతి లేకుండా సినిమాను తీస్తే వారిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు. దీనిపై దర్శకుడు శేఖర్ కపూర్ ట్విటర్లో స్పందించారు.' మిస్టర్ ఇండియా సినిమా గురించి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా... నన్ను అడగకుండా, నా అనుమతి లేకుండా సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నారు. మిస్టర్ ఇండియా సినిమా మంచి విజయం సాధించి దర్శకుడిగా నాకు గుర్తింపునిచ్చింది. ఈ సినిమాపై నాకు హక్కులు ఉండవా ?' అంటూ పేర్కొన్నారు.
Shekhar saheb the story the situations the scenes the characters the dialogue the lyrics even the title none of these were yours .I gave it all to you . Yes you execute it very well but how can your claim on the film be more than mine . It wasn’t you idea . It wasn’t your dream
— Javed Akhtar (@Javedakhtarjadu) February 28, 2020
దీనిపై జావేద్ అక్తర్ శేఖర్ కపూర్‌ను తప్పుబడుతూ రీట్వీట్ చేశారు.' మిస్టర్ ఇండియా కథ, పాటలు, డైలాగ్‌లు, సన్నివేశాలు, కనీసం చిత్రం టైటిల్ కూడా మీకు సొంతం కాదు. వాటిన్నంటిని నేను సలీమ్ కలిసి మీకు అందించాం అన్న విషయాన్ని మరిచిపోయారు. నిజమే.. మీరు సినిమాను చాలా బాగా తెరకెక్కించారు.. ఆ విషయం నేను ఒప్పుకుంటా.. కానీ సినిమా మీద మొత్తం హక్కులు నీకే ఉన్నాయనడం ఏం బాగాలేదు. అసలు ఈ సినిమా మీ ఆలోచన కాదు, అది మీ కల కూడా కాదు' అంటూ జావేద్ మండిపడ్డారు.