Mr. Kona
-
నేడు విధులకు కలెక్టర్
అనంతపురం అర్బన్: సింగపూర్ పర్యటనకు వెళ్లిన కలెక్టర్ కోన శశిధర్ సోమవారం జిల్లాకు చేరుకున్నారు. మంగళవారం నుంచి ఆయన విధులకు హాజరుకానున్నారు. కలెక్టర్ ఈ నెల 23న కుటుంబ సమేతంగా సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెల్సిందే. -
జీడిపల్లి.. తెగని లొల్లి
అనంతపురం సెంట్రల్ : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్న నానుడి జిల్లా అధికారపార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులకు అతికినట్లు సరిపోతుంది. సరైన సమయంలో ప్రణాళిక బద్దంగా వ్యవహరించకుండా అధికారులకు అడ్డదిడ్డమైన ఆదేశాలు జారీ చేసి ఇప్పుడు అనాలోచిత నిర్ణయం తీసుకుంటున్నారు. మరోసారి సరిదిద్దుకోలేని తప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. నీటితో తొణికిసలాడుతున్న జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవడానికి ప్రాజెక్టు మరవకే గండికొట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ కోన శశిధర్‌కు ఆదేశాలు రావడంతో సాధ్యాసాధ్యాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని హంద్రీనీవా, హెచ్చెల్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఈ ఏడాది గణనీయంగా 11.68 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి. దీంతో జిల్లాలో 60 శాతం నీటి అవసరాలు తీరాయనే చెప్పవచ్చు. ఒక వైపు హెచ్చెల్సీ ఆయకట్టు కింద సాగు చేసిన దాదాపు 90 వేల ఎకరాలలోని పంటలను కాపాడగలిగారు. మరో వైపు పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న 50 చెరువుల్లో దాదాపు 45 చెరువులను నింపగలిగారు. పెన్నానదిపై నిర్మించిన చాగళ్లు ప్రాజెక్టుకు, హెచ్చెల్సీ సౌత్ కెనాల్ కింద ఉన్న పలు చెరువులను నింపడంతో పాటు ఇంకా యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని సుబ్బరాయసాగర్, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే హెచ్చెల్సీ, హంద్రీనీవాలకు దండిగా నీరు వస్తున్న సమయంలో ప్రణాళికలకు విరుద్ధంగా వ్యవహరించారు. ముందు నాకంటే నాకు అంటూ ప్రజల్లో మైలేజీల కోసం ప్రజాప్రతినిధులు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నేటికీ పీఏబీఆర్ కుడికాల్వ కింద 5 చెరువులకు చుక్కనీరు చేరలేదు. జిల్లాలోనే అత్యంత దుర్భర కరువుపరిస్థితులు నెలకొనే యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని చెరువులకు ఆశించిన స్థాయిలో నీరు వెళ్లలేదు. చాగళ్లు రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రితో ప్రారంభించాలన్న అక్కడి ప్రజాప్రతినిధుల కళ నెరవేరలేదు. ఇటు హెచ్చెల్సీకి, అటు హంద్రీనీవాకు నీటిని నిలుపుదల చేసి నెలరోజులు కావస్తున్నా నీటి కోసం అధికారులపై ఒత్తిడి మాత్రం తగ్గలేదు. మార్చి ఆఖరి వరకూ హంద్రీనీవాకు నీరొస్తాయని భావించిన అధికారులు తొలుత మంత్రులు ఎలా చెబితే అలా వ్యవహరించారు. ప్రభుత్వం అసమర్థత కారణంగా శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీకి నీటినిల్వ పడిపోతున్నా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడంతో నెలరోజుల ముందే హంద్రీనీవాకు నీరు నిలిచిపోయాయి. దీంతో చివరి ప్రాంతంలోని చెరువులకు నీరు చేర క ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రస్తుతం ఆ నష్ట నివారణ చర్యల్లో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవడంపై మల్లాగుల్లాలు శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకుంటున్నాం. ఫేజ్-1లో 35వ ప్యాకేజీలో 216 కిలో మీటర్ వద్ద 1.694 టీఎంసీల సామర్థ్యంతో జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ప్రాజెక్టు కింద ఆయకట్టు అభివృద్ధి చెందకపోవడంతో ఈ ఏడాది కూడా నేరుగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి తాగు, సాగునీటి అవసరాల కోసం పీఏబీఆర్‌కు నీటిని మళ్ళించారు. జీడిపల్లి రిజర్వాయర్ పూర్తిగా నిండిన తర్వాత మరవ ద్వారా కిందనున్న పీఏబీఆర్‌లోకి కృష్ణాజలాలు కలుసుకుంటాయి. ఈ విధంగా జిల్లాకు ఈ ఏడాది 11.68 టీఎంసీలు వచ్చాయి. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 1.904 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నీరు వేసవితో పాటు ఆగస్టు వరకూ తాగునీటి అవసరాల కోసం తప్పనిసరిగా నిల్వ ఉంచాల్సి ఉంది. జీడిపల్లి రిజర్వాయర్‌కు ఏర్పాటు చేసిన స్లూయిస్ (చిన్నపాటి తూము) నుంచి రోజూ 100 క్యూసెక్కులు చొప్పున నీరు పీఏబీఆర్‌కు వస్తూనే ఉంటాయి. అలా కాదని ఒకేసారి 500, 600 క్యూసెక్కులు చొప్పున నీటిని తీసుకుని నిలిచిపోయిన చెరువులు, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశిధర్‌ను ఆదేశించారు. దీంతో సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని హెచ్చెల్సీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే మంత్రులు, ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న ఈ నిర్ణయం పూర్తిగా అనాలోచితమని నీటిపారుదలశాఖ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు. కలెక్టర్‌కు తెలియజేశాం జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవడంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. దీనిపై ప్రాజెక్టును పరిశీలించి వచ్చాం. అయితే అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఒక టీఎంసీ కోసం ప్రాజెక్టు గండి కొట్టలేం. మోటారు బిగించి నీటిని తీసుకోవాలన్నా ప్రభుత్వం విపరీతమైన భారం పడుతుంది. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేశాం, త్వరలో నివేదిక కూడా సమర్పిస్తాం. - శేషగిరిరావు, ఎస్ఈ, హెచ్చెల్సీ -
అభివృద్ధే లక్ష్యం
సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల ద్వారా అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇదే పంథాలో మిషన్‌మోడ్‌లో ‘అనంత’ అభివృద్ధి కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళుతున్నాం. శాస్త్రీయ పరిపాలన విధానంతో, జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది. దీనికి అందరి సహకారం కావాలి’ అని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. సోమవారం ఉదయం పోలీసుపెరేడ్ గ్రౌండ్స్‌లో 66వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆపై గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్, రబీల్లో 11 లక్షల నుంచి 9 లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో 59 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పశువులకు గ్రాసం కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. 350 మెట్రిక్‌టన్నుల విత్తనాలను రైతులకు సరఫరా చేసింది. కరువు నివారణకు వంద శాతం డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ ద్వారా ఈ ఏడాది 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అమలు చేస్తున్నాం. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు హంద్రీ-నీవా ద్వారా 13 టీఎంసీల నీటిని జిల్లాకు రప్పించాం. 49 చె రువులకు నీటిని విడుదల చేశాం. వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 21 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాం. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని 118 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు బహుళ రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించాం. సత్యసాయిసెంట్రల్ ట్రస్టు రూ.80 కోట్లు, రూ.28 కోట్ల ప్రభుత్వ నిధులతో దీన్ని పూర్తి చేశాం. ఎన్టీఆర్ సుజల ద్వారా జిల్లాలో 37 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 2 రూపాయలకు 20 లీటర్ల నీటిని అందిస్తున్నాం. హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకించింది. హెచ్చెల్సీ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఎన్పీ కుంటలో అల్ట్రామెగా సోలార్ పవర్ప్రాజె క్టు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. జేఎన్టీయూలో చదివిన విద్యార్థులకు అమెరికాలో ఎంఎస్ చేసేందుకు చికాగో స్టేట్ యూనివర్శిటీలతో ఎంఓయూ కుదిరింది. జేఎన్టీయూలో 7.5 కోట్ల రూపాయలతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది 4.12 లక్షల మంది కూలీలకు పని కల్పించి, 130 కోట్ల రూపాయలు చెల్లించాం. జిల్లాలో మూడు ఇసుకరీచ్‌ల ద్వారా 26 వేల క్యూబిల్ మీటర్ల ఇసుక తవ్వకం ద్వారా 2 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాకు 4.25 లక్షల మరుగుడొడ్లు అవసరమని ప్రభుత్వం గుర్తించింది. రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో తొలవిడతగా 780 కోట్ల రూపాయలను 6.62 లక్షల మంది రైతులకు మాఫీ చేశాం. వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయలు, 80 శాతం వైకల్యం ఉన్నవారికి 1500 రూ పాయల పింఛన్ ఇస్తున్నాం. ఎన్టీఆర్ వైద్య, ఆరో గ్య సేవ ద్వారా రూ.32 కోట్లతో 11వేల శస్త్ర చికిత్సలు చేశాం. మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ద్వారా అమృతహస్తం, సబల పథకాల ద్వారా పోషకాహారం అందిస్తున్నాం. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నాం. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తోన్న మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధికి నింతరం శ్రమిస్తూ, న్యాయసేవలు అందిస్తున్న జిల్లా జడ్జి, న్యాయమూర్తులకు, పోలీసులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరి సహకరిస్తారని ఆశిస్తున్నాను’ అని కలెక్టర్ ప్రసంగించారు. ప్రసంగం తర్వాత స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. పరేడ్ డ్రౌండ్స్లో అందరికీ అభివాదం చేశారు. పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్టాళ్లను తిలకించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీ గేయానంద్, జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, జేసీ లక్ష్మీకాంతం, ఏజేసీ సయ్యద్‌ఖాజా, డీఆర్వో హేమసాగర్, ఏఎస్పీలు మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు మల్లిఖార్జునవర్మ, నరసింగప్ప తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధే లక్ష్యం
ఏంబీఏ చదివిన కోన శశిధర్ అదిలాబాద్‌లో కలెక్టర్‌గా శిక్షణ పొందారు. రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలో సంయుక్త కలెక్టర్‌గా పనిచేశారు. విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ వైస్ ఛైర్మన్‌గా, కడప జిల్లా కలెక్టర్‌గా రాణించారు. మీ సేవ డెరైక్టర్‌గా, ఐటీ శాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అనంతపురం అర్బన్ : పేదల కష్టనష్టాలు పంచుకుని వారిని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తానని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల సహాయ సహకారాలతో ప్రజలకు సేవ చేయడానికి శయశక్తుల కృషి చేస్తానన్నారు. అనంతపురం జిల్లాకు రావడం చాలా సంతోషకరమని, ఇలాంటి జిల్లాలో పని చేసి ప్రజల కష్టాల్లో భాగస్వామినై వారికి సేవ చేస్తాన న్నారు. వరుస కరువులతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీటి సమస్య అధికంగా ఉన్నట్లు, రైతులు నష్టపోతున్నట్లు తెలుసుకున్నానన్నారు. ఈ సమస్యలను అధిగమించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి అందరి సహకారంతో ముందుకెళ్తానన్నారు. గతంలో కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అనంతపురం జిల్లాపై అవగాహన ఉందన్నారు. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోన శశిధర్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం, అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజామొిహ ద్దీన్, జిల్లా రెవిన్యూ అధికారులు సిహెచ్ హేమసాగర్, పౌర సరఫరాలశాఖ ఏడీ వెంకటేశ్వరరావు, డీపీఆర్ఓ బి.జయమ్మ, ఏపీఆర్ఓ పురుషోత్తం, కలెక్టరేట్ సిబ్బంది స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మేయర్ మదమంచి స్వరూప కలెక్టర్‌ను కలిసి, అనంతపురం నగర పరిస్థితిని వివరించారు. జవాబుదారీగా పని చేయండి : ఉద్యోగులకు కలెక్టర్ పిలుపు అధికారులు జవాబుదారీతనం, నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రెవిన్యూ భవనంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు నిర్భయంగా పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేసే వారికి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందన్నారు. ఇక్కడి అధికారులు పలువురితో తనకు పరిచయం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్ల అమలే తన ప్రాధాన్యత అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్నారన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన రాష్ర్ట, జిల్లా స్థాయి సమాచారంతో పాటు గ్రామ స్థాయి ప్రగతి వివరాలు కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని తెలిపారు. కాబట్టి శాఖపరమైన అన్ని అంశాలపై, క్షేత్ర స్థాయి సమస్యలపై అధికారులకు పూర్తి అవగాహన వుండాలన్నారు. ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో పబ్లిక్ గ్రీవెన్స్ మానిటరింగ్‌కు ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజలకు సకాలంలో సరైన న్యాయం చేసేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిపారు. తదనుగుణంగా గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారానికి కాలాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తమ మార్గాల ద్వారా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో మాతా, శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. వైద్యం, విద్య, మహిళా, శిశు సంక్షేమం, స్వయం సహాయక సంఘాల సాధికారిత, ఉపాధి హామీ పనుల కల్పన, ఇంజనీరింగ్ పనులు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో యూనిట్లు మంజూరు చేస్తున్న వివిధ శాఖల కార్పొరేషన్లు తమ లక్ష్యాల సాధనకు మండలాల వారీగా రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. పదవ తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని, ఈ రెండు నెలల కాలంలో అధికారులందరినీ భాగస్వామ్యులను చేసి మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్మార్ట్ విలేజ్‌లో నిర్దేశించిన 20 అంశాలపై శ్రద్ధ తీసుకొని జిల్లా ర్యాంకును ఉన్నత స్థాయిలో నిలపాలని కోరారు.