అభివృద్ధే లక్ష్యం | Development goal | Sakshi
Sakshi News home page

అభివృద్ధే లక్ష్యం

Published Sat, Jan 24 2015 2:48 AM | Last Updated on Sat, Sep 2 2017 8:08 PM

అభివృద్ధే లక్ష్యం

అభివృద్ధే లక్ష్యం

ఏంబీఏ చదివిన కోన శశిధర్ అదిలాబాద్‌లో కలెక్టర్‌గా శిక్షణ పొందారు. రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలో సంయుక్త కలెక్టర్‌గా పనిచేశారు. విజయవాడ అర్బన్ డెవలప్‌మెంట్ వైస్ ఛైర్మన్‌గా, కడప జిల్లా కలెక్టర్‌గా రాణించారు. మీ సేవ డెరైక్టర్‌గా, ఐటీ శాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు.
 
అనంతపురం అర్బన్ : పేదల కష్టనష్టాలు పంచుకుని వారిని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తానని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల సహాయ సహకారాలతో ప్రజలకు సేవ చేయడానికి శయశక్తుల కృషి చేస్తానన్నారు.

అనంతపురం జిల్లాకు రావడం చాలా సంతోషకరమని, ఇలాంటి జిల్లాలో పని చేసి ప్రజల కష్టాల్లో భాగస్వామినై వారికి సేవ చేస్తాన న్నారు. వరుస కరువులతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీటి సమస్య అధికంగా ఉన్నట్లు, రైతులు నష్టపోతున్నట్లు తెలుసుకున్నానన్నారు. ఈ సమస్యలను అధిగమించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి అందరి సహకారంతో ముందుకెళ్తానన్నారు. గతంలో కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అనంతపురం జిల్లాపై అవగాహన ఉందన్నారు.

జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోన శశిధర్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం, అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజామొిహ ద్దీన్, జిల్లా రెవిన్యూ అధికారులు సిహెచ్ హేమసాగర్, పౌర సరఫరాలశాఖ ఏడీ వెంకటేశ్వరరావు, డీపీఆర్‌ఓ బి.జయమ్మ, ఏపీఆర్‌ఓ పురుషోత్తం, కలెక్టరేట్ సిబ్బంది స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మేయర్ మదమంచి స్వరూప కలెక్టర్‌ను కలిసి, అనంతపురం నగర పరిస్థితిని వివరించారు.
 
జవాబుదారీగా పని చేయండి : ఉద్యోగులకు కలెక్టర్ పిలుపు
అధికారులు జవాబుదారీతనం, నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రెవిన్యూ భవనంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు నిర్భయంగా పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేసే వారికి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందన్నారు. ఇక్కడి అధికారులు పలువురితో తనకు పరిచయం ఉందన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్ల అమలే తన ప్రాధాన్యత అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్నారన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన రాష్ర్ట, జిల్లా స్థాయి సమాచారంతో పాటు గ్రామ స్థాయి ప్రగతి వివరాలు కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని తెలిపారు. కాబట్టి శాఖపరమైన అన్ని అంశాలపై, క్షేత్ర స్థాయి సమస్యలపై అధికారులకు పూర్తి అవగాహన వుండాలన్నారు.

ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో పబ్లిక్ గ్రీవెన్స్ మానిటరింగ్‌కు ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజలకు సకాలంలో సరైన న్యాయం చేసేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిపారు. తదనుగుణంగా గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారానికి కాలాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తమ మార్గాల ద్వారా అర్జీలను పరిష్కరించాలని సూచించారు.  

జిల్లాలో మాతా, శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. వైద్యం, విద్య, మహిళా, శిశు సంక్షేమం, స్వయం సహాయక సంఘాల సాధికారిత, ఉపాధి హామీ పనుల కల్పన, ఇంజనీరింగ్ పనులు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో యూనిట్లు మంజూరు చేస్తున్న వివిధ శాఖల కార్పొరేషన్లు తమ లక్ష్యాల సాధనకు మండలాల వారీగా రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు.

పదవ తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని, ఈ రెండు నెలల కాలంలో అధికారులందరినీ భాగస్వామ్యులను చేసి మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్మార్ట్ విలేజ్‌లో నిర్దేశించిన 20 అంశాలపై శ్రద్ధ తీసుకొని జిల్లా ర్యాంకును ఉన్నత స్థాయిలో నిలపాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement