‘‘ఈ గూడుపుఠాణికి గురువు, ఈ మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడు. అతను ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడు అనే మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను. ప్రజాసంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో ఉండని నేను... అతను కడుతున్న ముఠాలు, చేరదీస్తున్న గ్రూపులను గురించి పట్టించుకోలేదు.
అతనిలో పదవీకాంక్ష ఇంతగా గూడుకట్టుకుందనీ, ఆ కోరిక అతనిని ద్రోహిగా మారుస్తుందనీ, అతని వలన ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందనీ, అధికారం కోసం ఆ పెద్ద మనిషి ఇంతటి అల్పమైన, నీచమైన, అతి దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేకపోయాను’’ అని బాధపడ్డారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్. పదవీచ్యుతుడయిన తరువాత ఆయన చేసిన క్యాసెట్‌లోని భావాలు యథాతథంగా...
తమ్ముల్లారా, చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీకు తెలుసు ప్రజలే నా దేవుళ్లని, ప్రజాక్షేమమే నా ఊపిరని, ప్రజా సేవే పరమార్థమని. బడుగు ప్రజల అభ్యు న్నతి కోసమే ఈ జీవితం అంకితమని మీకు తెలుసు. అందుకే మీ అండే నాకు కొండంత బలం. మీ చైతన్యమే నా జీవన నాడి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. కాబట్టి నాటి నుండి నేటి వరకు జరిగిన చరిత్రను మీ ముందు, ప్రజాన్యాయస్థానం ముందు ఉంచుతున్నాను... మంచేదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో మీకు తెలియాలని! ఆశయానికీ ఆశకూ, త్యాగానికీ స్వార్థానికీ, నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ సమరంలో న్యాయ నిర్ణేతలు మీరు.
1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాను. ఎందుకు? కళామతల్లి ముద్దుబిడ్డగా, మీ అందరి ఆప్యాయతలను చూరగొన్న అదృష్టవంతుడిగా, భగవంతుని వేషధారణలో పునీతమైన నా జీవితాన్ని రాజకీయాల్లో ఎందుకు ప్రవేశపెట్టాను? ఎందుకు? తెలుగు వెలుగులు దిగంతాలు ప్రసరించాలని. తెలుగువారి ఆత్మ గౌరవం ఆకాశం అంత ఎత్తు ఎదగాలని. తరతరాల దోపిడీలో నలిగి బ్రతుకు భారంగా కృంగి కృశించిపోయిన బడుగు జీవుల కన్నీళ్ళు తుడవాలని ఎముకలు ముక్కలు చేసుకున్నా. ఒక్కపూట గంజికైనా నోచుకోని ఆ కష్టజీవులకు పట్టెడన్నం పెట్టడం కోసం, జాతి జీవనాడులైన అసామాన్య జీవులకు ఓ గూడు కట్టించడం కోసం ప్రజాసేవే పరమార్థంగా ఎంచిన నా ఆదర్శాన్ని మీరు ఆదరించారు. నా మీద విశ్వాసంతో, నా ఆశయాల పట్ల నమ్మకంతో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అపురూపమైన విజయాన్ని అందించారు. 35 ఏళ్ళ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు స్వస్తి చెప్పి, మీ అన్నకు ప్రభుత్వాన్ని అప్పగించారు. అందుకే జనసేవా పథకాలు అమలు చేశాను. బడుగు వర్గాల కోసం లక్షల కొద్దీ ఇళ్ళు నిర్మించాను. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంలో నిరుపేదలకింత అన్నం పెట్టగలిగాను. ఆడపడుచులకు ఆస్తి హక్కును అందించాను. కార్మికులకు, కర్షకులకు ఒకరేమిటి? అన్ని వర్గాల వారిని ఆత్మీయులుగా భావించాను, గౌర వించాను, సత్కరించాను. ఆ తరువాత 1989వ సంవత్సరం ఎన్నికలలో కూడా ప్రజాభిమానం తెలుగుదేశం పట్లే ఉన్నప్పటికీ పార్టీలోని కొందరు స్వార్థపరులు, బడావ్యాపారులు రాజకీయ దళారీలతో కుమ్మక్కై, తమ స్వప్రయోజనాల కోసం పార్టీ శ్రేయస్సును, రాష్ట్ర శ్రేయస్సును విస్మరించి సంకుచిత రాజకీయాలు నడపబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 5 సంవత్సరములు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్య పట్ల తెలుగు దేశం పార్టీ స్పందించింది.
1994లో మళ్ళీ ఎన్నికలు వచ్చినవి. తెలుగుదేశం పార్టీకి 150 సీట్ల కన్నా మించి రావనీ, ఆ 150 మంది శాసనసభ్యులలో ఏ పార్టీకో 50 మందిని ప్రలోభపెట్టి పార్టీని చీల్చి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనీ పార్టీలో కొందరు కుట్రదారులు ముందుగా పథకం వేశారు. కానీ వాళ్ళ ఆశలకు విరుద్ధంగా, రాజకీయ పండిత అంచనాలకు మించిన విధంగా అపూర్వమైన విజయాన్ని మీరు నాకు సాధించిపెట్టారు. మీ అన్న మీద ఉన్న విశ్వాసాన్ని మరోసారి మహాద్భుతంగా ప్రకటించారు. 224 సీట్లతో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని ప్రకటించడం చేతగాని ఆ తెలుగు దేశం వ్యతిరేక శక్తులు కొంతమంది లోలోన గూడుపుఠాణి అవలం బించారు. ఈ గూడుపుఠాణికి గురువు, ఈ కుట్రకు గూడు, ఈ మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడు. నా గుండెల్లో చిచ్చుపెట్టినవాడు.
మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో! కాంగ్రెస్‌లో ఉండి, తెలుగుదేశం పార్టీని ఎదిరించి నాతోనైనా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఒక చిన్న మిడత. తెలుగుదేశం అఖండ విజయం సాధించింది. అధికారానికి వచ్చిన తరువాత అతను పార్టీలో చేరతానని వస్తే, అతనిని పార్టీలో చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినా కానీ అతను పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తరువాత పార్టీలో ముఖ్యమైన పదవిని ఇచ్చాను. కానీ అతను ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడు అనే మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను. ప్రజాసంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో ఉండని నేను... అతను కడుతున్న ముఠాలు, చేర దీస్తున్న గ్రూపులను గురించి పట్టించుకోలేదు. అసలు అతనిలో పదవీకాంక్ష ఇంతగా గూడుకట్టుకుందనీ, ఆ కోరిక అతనిని ద్రోహిగా మారుస్తుందనీ, అతని వల్లే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పు కోవలసి వస్తుందనీ, అతని వలన ప్రజాభీష్టమే వ్యర్థమవుతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందనీ, అధికారం కోసం ఆ పెద్ద మనిషి ఇంతటి అల్పమైన, నీచమైన, అతి దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేకపోయాను. నాతోనే ఉంటూ, ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహి స్తూనే చాటుగా, మాటుగా, రహస్యంగా పద్మవ్యూహం పన్నుతాడన్న విషయాన్ని నేను గుర్తించలేకపోయాను.
తన పదవీకాంక్షను తీర్చుకోవడం కోసం తండ్రి నుంచి కొడుకును దూరం చేశాడు. తండ్రి పట్ల అంతులేని ఆరాధనాభావం ఉన్నవాడు నా హరి. నిద్రాహారాలు మాని చైతన్యరథాన్ని నడిపిన నా బిడ్డ. తండ్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే తన కంట్లో గుచ్చుకున్నంతగా వాపోయే నా హరిని నాకు దూరం చేశాడు. నా ముందు నిలబడి ఎరగని నా కుమారుణ్ణి నన్నే ఎదిరించి, కవ్వించేందుకు పురిగొల్పాడు. ఒక సాకు, ఒక వంక, ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిందట. ఏమిటి ఆ అన్యాయం? ఎవరికి ఆ అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకిత భావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఏ కార్యకర్తలకు, ఏ నా తమ్ముళ్ళకు అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశ వాదులకే జరిగింది. చంద్రబాబు, ఆ పెద్దమనిషి, ఆ మేక వన్నె పులి, ఆ తేనె పూసిన కత్తి తయారు చేసిన కుట్రదారులకే జరిగింది. నా దేవుళ్ళు ప్రజలు. ఆ ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళాలని మరలా నేను పర్యటన ప్రారంభించాను. ఆ పర్యటనలో నాతోనే ఉంటూ, నేనే దేవుణ్ణి అని చెబుతూ, చాపకింద నీళ్ళ లాగా, పుట్టలో తేళ్ళలాగా, పొదల్లో నక్కల్లాగా, కుట్రలు, కుతంత్రాన్ని అల్లారు. మోసాన్ని పోషించారు. ప్రజాప్రభుత్వాన్ని దించడానికి బడా వ్యాపా రుల్ని, రాజకీయ దళారుల్ని, ఈనాడు గోబెల్స్ ప్రచారంలో దిట్టల్ని కూడగట్టారు. ఆగస్టు 23వ తేదీ వరకు నేను ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నాను. పర్యటన ముగించుకుని నేను హైదరాబాదు తిరిగి వచ్చేలోపే చంద్రబాబు తన కుతంత్రాన్ని అమలు జరపడం ప్రారంభించాడు.
పార్టీ సమస్యలను, ప్రభుత్వ విషయాలను చర్చించాలన్న మిషతో శాసనసభ్యులను పిలిపించాడు. 24వ తేదీన ఆ శాసన సభ్యుల్లో కొందరిని వైశ్రాయ్ హోటల్లో నిర్బంధించాడు. 70 మంది ఉంటే 150 మంది ఉన్నారని గోబెల్స్ ప్రచారం చేయించి శాసన సభ్యుల మనస్సును ప్రభావితం చేయించాడు. అమాయకులైన నా తమ్ముళ్ళను, నా శాసనసభ్యులను రకరకాలుగా మభ్యపెట్టి, బడా వ్యాపారుల సాయంతో ప్రలోభపెట్టి, నా దగ్గరకు రావడానికి యత్నించిన వాళ్ళను హోటల్ నుండి బయటకు రానివ్వకుండా రౌడీలను, గూండాలను కాపలా పెట్టి ఆ శాసన సభ్యులందరూ తనకు సపోర్టు అని ప్రచారం చేయించాడు. సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్ళంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి... ఏమిటీ ఈ ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటీ... ఈ రామారావు చేసిన నేరం?
ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన మరుక్షణం మద్య నిషేధం ఫైలు మీద సంతకం పెట్టి, ఆడపడుచుల కన్నీళ్ళు తుడవడం తప్పా? కిలో బియ్యం రెండురూపాయలకే ఇవ్వాలని నిర్ణయించడం నా నేరమా? ఏమిటి నేను చేసిన తప్పు? అన్నదాత రైతన్న పంటలు పండించడానికి వాడే విద్యుచ్ఛక్తి సాలుకు హార్స్ పవర్ 50 రూపా యలకే సరఫరా చేయడమా? ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చిత్తశుద్ధితో అమలు చేయడమా? ఏ దేవుళ్ళు నాకు అధికారాన్ని ఇచ్చారో ఆ ప్రజల వాకిటికే ప్రభుత్వాన్ని తీసు కెళ్ళడమా? ఏమిటీ నేను చేసిన నేరం? నోరు లేని జనానికి నోరు ఇవ్వడమా? బడుగు, బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించడమా? ఏ పథకం అమలు ఎలా జరుగుతున్నదో, జరగక పోతే ఎందుకు జరగడం లేదో నిలదీసి అడిగే అవకాశాన్ని, బలాన్ని అట్టడుగు వర్గాలకు అందించడమా? ఇవేమీ కావు. ఆ పెద్ద మనుష్యుల దృష్టిలో నా నేరం వాళ్ళ స్వార్థాలకు ఎన్టీఆర్ ఉపయోగ పడక పోవడం. బడావ్యాపారుల, సారాజుల చేతుల్లో కీలుబొమ్మ ప్రభుత్వం కాకపోవడం! దళారీలు, పవర్ బ్రోకర్స్‌కు ఆస్కారం లేకపోవడం... ఇవి నేను చేసిన నేరాలు. మరి వాళ్ళు పెద్ద మనుష్యులు! ప్రజాస్వామ్య రక్షకులట! రక్షకులా? కాదు, భక్షకులు. ధనకాంక్షతో, పదవీ వ్యామోహంతో, పెడదారులు పట్టిన వీరు స్వప్రయోజనాలు తప్ప ప్రజల గురించి ఏనాడూ ఆలోచించని ఈ స్వార్థపరులు ప్రజా ప్రయోజనాలు సాధిస్తారా? ప్రజాభిమతాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అంకిత భావంతో ప్రజాసేవ చేస్తారా? ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్ర బాబు... ఎన్టీఆర్ మా దేవుడు, ఆయన విధానాలే అమలు జరుపు తానంటాడు. చేతులు జోడించి నమస్కారం చేసి, తుపాకీ పేల్చిన గాంధీ మహాత్ముని పొట్టన పెట్టుకున్న గాడ్సే కన్నా మించిన హంత కుడు. పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల మనిషిని. చివరి రక్తపు బొట్టు వరకు, ప్రజాసేవే పరమార్థంగా ఈ జీవితాన్ని సాగిస్తాను. ప్రజలే నా దేవుళ్ళు. ప్రజల హృదయమే నా దేవాలయం. ఈ వెన్నుపోటు తగిలింది నాకు మాత్రమే కాదు. ప్రజలకు, మీకు మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి. మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆధర్మాలకు ఈ వెన్నుపోటు. ఈ విఘాతం. తమ్ముళ్ళూ! చెల్లెళ్ళూ! ఇప్పుడు ఆలోచించండి. మీరు నాకు అండ. మీకు నా కైదండ. కుట్రదారులకు బుద్ధి చెప్పండి. దగాకోరులకు తగిన శాస్తి చేయండి. లాలూచీదారుల ఆటలు కట్టించండి.
విశ్లేషణ
డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి
‘తెలుగుతేజం (ఎన్టీఆర్ రాజకీయం జీవితం)’ పుస్తకంలోని ‘జామాతా – దశమ గ్రహః’ అధ్యాయం లోంచి.
Comments
Please login to add a commentAdd a comment