అభివృద్ధే లక్ష్యం
సాక్షిప్రతినిధి, అనంతపురం : ‘నవ్యాంధ్రప్రదేశ్‌లో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్ల ద్వారా అభివృద్ధిని సాధించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఇదే పంథాలో మిషన్‌మోడ్‌లో ‘అనంత’ అభివృద్ధి కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం. వ్యవసాయం, సంక్షేమం, అభివృద్ధి, విద్య, వైద్యంతో పాటు సమగ్ర అభివృద్ధి కోసం ప్రణాళికను సిద్ధం చేసుకుని ముందుకెళుతున్నాం. శాస్త్రీయ పరిపాలన విధానంతో, జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో అడుగులు వేస్తోంది.
దీనికి అందరి సహకారం కావాలి’ అని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అన్నారు. సోమవారం ఉదయం పోలీసుపెరేడ్ గ్రౌండ్స్‌లో 66వ గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆపై గౌరవ వందనం స్వీకరించారు. తర్వాత జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే.. ‘ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్, రబీల్లో 11 లక్షల నుంచి 9 లక్షల హెక్టార్లకు సాగు విస్తీర్ణం తగ్గింది. దీంతో 59 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది.
పశువులకు గ్రాసం కొరత రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంది. 350 మెట్రిక్‌టన్నుల విత్తనాలను రైతులకు సరఫరా చేసింది. కరువు నివారణకు వంద శాతం డ్రిప్, స్ప్రింక్లర్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఉద్యాన పంటల అభివృద్ధి మిషన్ ద్వారా ఈ ఏడాది 9 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు అమలు చేస్తున్నాం. తాగునీటి ఎద్దడిని నివారించేందుకు హంద్రీ-నీవా ద్వారా 13 టీఎంసీల నీటిని జిల్లాకు రప్పించాం. 49 చె రువులకు నీటిని విడుదల చేశాం.
వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు 21 కోట్ల రూపాయలతో కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాం. పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని 118 గ్రామాలకు తాగునీటిని అందించేందుకు బహుళ రక్షిత నీటి పథకాన్ని ప్రారంభించాం. సత్యసాయిసెంట్రల్ ట్రస్టు రూ.80 కోట్లు, రూ.28 కోట్ల ప్రభుత్వ నిధులతో దీన్ని పూర్తి చేశాం. ఎన్టీఆర్ సుజల ద్వారా జిల్లాలో 37 మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 2 రూపాయలకు 20 లీటర్ల నీటిని అందిస్తున్నాం.
హంద్రీ-నీవా ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకించింది. హెచ్చెల్సీ ఆధునికీకరణకు చర్యలు తీసుకుంటోంది. ఎన్‌పీ కుంటలో అల్ట్రామెగా సోలార్ పవర్‌ప్రాజె క్టు ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. జేఎన్‌టీయూలో చదివిన విద్యార్థులకు అమెరికాలో ఎంఎస్ చేసేందుకు చికాగో స్టేట్ యూనివర్శిటీలతో ఎంఓయూ కుదిరింది. జేఎన్‌టీయూలో 7.5 కోట్ల రూపాయలతో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేశాం.
ఉపాధి హామీ పథకం ద్వారా ఈ ఏడాది 4.12 లక్షల మంది కూలీలకు పని కల్పించి, 130 కోట్ల రూపాయలు చెల్లించాం. జిల్లాలో మూడు ఇసుకరీచ్‌ల ద్వారా 26 వేల క్యూబిల్ మీటర్ల ఇసుక తవ్వకం ద్వారా 2 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. స్వచ్ఛభారత్‌లో భాగంగా జిల్లాకు 4.25 లక్షల మరుగుడొడ్లు అవసరమని ప్రభుత్వం గుర్తించింది.
రుణమాఫీ పథకం ద్వారా జిల్లాలో తొలవిడతగా 780 కోట్ల రూపాయలను 6.62 లక్షల మంది రైతులకు మాఫీ చేశాం. వృద్ధులు, వితంతువులకు నెలకు వెయ్యి రూపాయలు, 80 శాతం వైకల్యం ఉన్నవారికి 1500 రూ పాయల పింఛన్ ఇస్తున్నాం. ఎన్‌టీఆర్ వైద్య, ఆరో గ్య సేవ ద్వారా రూ.32 కోట్లతో 11వేల శస్త్ర చికిత్సలు చేశాం. మహిళా, శిశు అభివృద్ధి సంస్థ ద్వారా అమృతహస్తం, సబల పథకాల ద్వారా పోషకాహారం అందిస్తున్నాం. జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నాం.
జిల్లా అభివృద్ధికి కృషి చేస్తోన్న మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు. జిల్లా అభివృద్ధికి నింతరం శ్రమిస్తూ, న్యాయసేవలు అందిస్తున్న జిల్లా జడ్జి, న్యాయమూర్తులకు, పోలీసులు, స్వచ్ఛందసంస్థల ప్రతినిథులకు ప్రత్యేక కృతజ్ఞతలు. జిల్లా సర్వతోముఖాభివృద్ధికి అందరి సహకరిస్తారని ఆశిస్తున్నాను’ అని కలెక్టర్ ప్రసంగించారు.
ప్రసంగం తర్వాత స్వాతంత్య్ర సమర యోధులను సన్మానించారు. పరేడ్ డ్రౌండ్స్‌లో అందరికీ అభివాదం చేశారు. పలు రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వారికి ప్రశంసపత్రాలు అందజేశారు. అనంతరం పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, శకటాల ప్రదర్శన, స్టాళ్లను తిలకించారు. వేడుకల్లో ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, బీకే పార్థసారథి, వరదాపురం సూరి, ఎమ్మెల్సీ గేయానంద్, జిల్లా ఎస్పీ రాజశేఖర్‌బాబు, జేసీ లక్ష్మీకాంతం, ఏజేసీ సయ్యద్‌ఖాజా, డీఆర్వో హేమసాగర్, ఏఎస్పీలు మాల్యాద్రి, వెంకటేశ్వర్లు, డీఎస్పీలు మల్లిఖార్జునవర్మ, నరసింగప్ప తదితరులు పాల్గొన్నారు.