అనంతపురం సెంట్రల్ : చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అన్న నానుడి జిల్లా అధికారపార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులకు అతికినట్లు సరిపోతుంది. సరైన సమయంలో ప్రణాళిక బద్దంగా వ్యవహరించకుండా అధికారులకు అడ్డదిడ్డమైన ఆదేశాలు జారీ చేసి ఇప్పుడు అనాలోచిత నిర్ణయం తీసుకుంటున్నారు. మరోసారి సరిదిద్దుకోలేని తప్పు చేయడానికి సిద్ధమవుతున్నారు. నీటితో తొణికిసలాడుతున్న జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవడానికి ప్రాజెక్టు మరవకే గండికొట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ కోన శశిధర్‌కు ఆదేశాలు రావడంతో సాధ్యాసాధ్యాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని హంద్రీనీవా, హెచ్చెల్సీ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంత వెంకటరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి పథకం ద్వారా ఈ ఏడాది గణనీయంగా 11.68 టీఎంసీలు జిల్లాకు వచ్చాయి.
దీంతో జిల్లాలో 60 శాతం నీటి అవసరాలు తీరాయనే చెప్పవచ్చు. ఒక వైపు హెచ్చెల్సీ ఆయకట్టు కింద సాగు చేసిన దాదాపు 90 వేల ఎకరాలలోని పంటలను కాపాడగలిగారు. మరో వైపు పీఏబీఆర్ కుడికాల్వ కింద ఉన్న 50 చెరువుల్లో దాదాపు 45 చెరువులను నింపగలిగారు. పెన్నానదిపై నిర్మించిన చాగళ్లు ప్రాజెక్టుకు, హెచ్చెల్సీ సౌత్ కెనాల్ కింద ఉన్న పలు చెరువులను నింపడంతో పాటు ఇంకా యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని సుబ్బరాయసాగర్, కోమటికుంట్ల, గరుగుచింతలపల్లి చెరువులకు నీటిని విడుదల చేస్తున్నారు. అయితే హెచ్చెల్సీ, హంద్రీనీవాలకు దండిగా నీరు వస్తున్న సమయంలో ప్రణాళికలకు విరుద్ధంగా వ్యవహరించారు.
ముందు నాకంటే నాకు అంటూ ప్రజల్లో మైలేజీల కోసం ప్రజాప్రతినిధులు వ్యవహరించారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనివల్ల నేటికీ పీఏబీఆర్ కుడికాల్వ కింద 5 చెరువులకు చుక్కనీరు చేరలేదు. జిల్లాలోనే అత్యంత దుర్భర కరువుపరిస్థితులు నెలకొనే యల్లనూరు, పుట్లూరు మండలాల్లోని చెరువులకు ఆశించిన స్థాయిలో నీరు వెళ్లలేదు. చాగళ్లు రిజర్వాయర్‌ను ముఖ్యమంత్రితో ప్రారంభించాలన్న అక్కడి ప్రజాప్రతినిధుల కళ నెరవేరలేదు.
ఇటు హెచ్చెల్సీకి, అటు హంద్రీనీవాకు నీటిని నిలుపుదల చేసి నెలరోజులు కావస్తున్నా నీటి కోసం అధికారులపై ఒత్తిడి మాత్రం తగ్గలేదు. మార్చి ఆఖరి వరకూ హంద్రీనీవాకు నీరొస్తాయని భావించిన అధికారులు తొలుత మంత్రులు ఎలా చెబితే అలా వ్యవహరించారు. ప్రభుత్వం అసమర్థత కారణంగా శ్రీశైలంలో డెడ్‌స్టోరేజీకి నీటినిల్వ పడిపోతున్నా తెలంగాణా ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి కొనసాగించడంతో నెలరోజుల ముందే హంద్రీనీవాకు నీరు నిలిచిపోయాయి. దీంతో చివరి ప్రాంతంలోని చెరువులకు నీరు చేర క ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర నష్టం ఏర్పడింది. ప్రస్తుతం ఆ నష్ట నివారణ చర్యల్లో ప్రజాప్రతినిధులు నిమగ్నమయ్యారు.
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవడంపై మల్లాగుల్లాలు
శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీనీవా ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని తీసుకుంటున్నాం. ఫేజ్-1లో 35వ ప్యాకేజీలో 216 కిలో మీటర్ వద్ద 1.694 టీఎంసీల సామర్థ్యంతో జీడిపల్లి రిజర్వాయర్ నిర్మాణం జరిగింది. ప్రాజెక్టు కింద ఆయకట్టు అభివృద్ధి చెందకపోవడంతో ఈ ఏడాది కూడా నేరుగా జీడిపల్లి రిజర్వాయర్ నుంచి తాగు, సాగునీటి అవసరాల కోసం పీఏబీఆర్‌కు నీటిని మళ్ళించారు. జీడిపల్లి రిజర్వాయర్ పూర్తిగా నిండిన తర్వాత మరవ ద్వారా కిందనున్న పీఏబీఆర్‌లోకి కృష్ణాజలాలు కలుసుకుంటాయి. ఈ విధంగా జిల్లాకు ఈ ఏడాది 11.68 టీఎంసీలు వచ్చాయి. ప్రస్తుతం పీఏబీఆర్‌లో 1.904 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
ఈ నీరు వేసవితో పాటు ఆగస్టు వరకూ తాగునీటి అవసరాల కోసం తప్పనిసరిగా నిల్వ ఉంచాల్సి ఉంది. జీడిపల్లి రిజర్వాయర్‌కు ఏర్పాటు చేసిన స్లూయిస్ (చిన్నపాటి తూము) నుంచి రోజూ 100 క్యూసెక్కులు చొప్పున నీరు పీఏబీఆర్‌కు వస్తూనే ఉంటాయి. అలా కాదని ఒకేసారి 500, 600 క్యూసెక్కులు చొప్పున నీటిని తీసుకుని నిలిచిపోయిన చెరువులు, ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని అధికారపార్టీ ప్రజాప్రతినిధులు నిర్ణయించారు. వెంటనే అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశిధర్‌ను ఆదేశించారు. దీంతో సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని హెచ్చెల్సీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. అయితే మంత్రులు, ప్రజాప్రతినిధులు తీసుకుంటున్న ఈ నిర్ణయం పూర్తిగా అనాలోచితమని నీటిపారుదలశాఖ ఇంజనీర్లు స్పష్టం చేస్తున్నారు.
కలెక్టర్‌కు తెలియజేశాం
జీడిపల్లి రిజర్వాయర్ నుంచి ఒక టీఎంసీ నీటిని తీసుకోవడంపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందాయి. దీనిపై ప్రాజెక్టును పరిశీలించి వచ్చాం. అయితే అక్కడ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ఒక టీఎంసీ కోసం ప్రాజెక్టు గండి కొట్టలేం. మోటారు బిగించి నీటిని తీసుకోవాలన్నా ప్రభుత్వం విపరీతమైన భారం పడుతుంది. ఇదే విషయాన్ని కలెక్టర్‌కు తెలియజేశాం, త్వరలో నివేదిక కూడా సమర్పిస్తాం.
- శేషగిరిరావు, ఎస్‌ఈ, హెచ్చెల్సీ
జీడిపల్లి.. తెగని లొల్లి
Published Sun, Mar 15 2015 2:29 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
Advertisement
Advertisement