80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్?
న్యూఢిల్లీ: స్మార్ట్ ఫోన్.. చేతిలో లేనిదే ఇప్పుడు ఎవరి జీవితం గడవటం లేదు. కమ్యూనికేషన్ దగ్గరి నుంచి ప్రపంచంలో ఏమూలలో అయినా జరిగే అరచేతిలోనే క్షణాల్లో తెలుసుకుంటున్నారు. అయితే గత దశాబ్ద కాలంగా ఇవి మనకు అందుబాటులోకి వచ్చాయని చెప్పుకుంటున్నప్పటికీ, ఓ ఆసక్తికరమైన విషయం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
సుమారు 80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటూ ఓ అమెరికన్ పెయింటింగ్ నిరూపిస్తోంది. ఉంబెర్టో రొమానో అనే చిత్రకారుడు 1937 లో ఓ మురల్(గోడ మీద పెయింటింగ్) ను గీశారు. దాని పేరు ‘మిస్టర్ పించోన్ అండ్ ది సెట్టింగ్ ఆఫ్ స్ప్రింగ్ ఫీల్డ్’.. ఇప్పుడు మనం మస్సాచుసెట్ట్స్ పట్టణంగా చెప్పకుంటున్న ప్రాంతంను నిర్మాణకర్త అయిన విలియం పించోన్ గుర్తుగా గీయబడిందే ఈ ఆర్ట్. ఆ చిత్రాన్ని గమనిస్తే పించోన్(పింక్ రంగు సూట్)కు ఎడమ వైపుగా ఓ రెడ్‌ఇండియన్ తెగకు చెందిన వ్యక్తి సెల్ఫీ దిగినట్లు ఉంది. దీంతో 80 ఏళ్ల క్రితమే స్మార్ట్ ఫోన్లు ఉన్నాయంటూ మదర్బోర్డ్ అనే ఓ మాగ్జైన్ ఆర్టికల్ ప్రచురించింది.
గతేడాది ఆపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీమ్ కుక్ అమ్‌స్టర్‌డ్యామ్ పర్యటన సందర్భంగా రిజిక్స్ మ్యూజియంను సందర్శించినప్పుడు 17వ శతాబ్దానికి చెందిన ఓ పెయింటింగ్‌లో చేతిలో ఐఫోన్ మాదిరి వస్తువును పట్టుకుని ఉన్న మహిళ ఫోటోను గమనించి వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పించోన్ పెయిటింగ్ లో కూడా స్మార్ట్ ఫోన్ ఆనవాళ్లు బయటపడటంతో కాల గమన సిద్ధాంతాన్ని కొందరు వెలుగులోకి తెస్తున్నారు. ఆ సమయంలో స్మార్ట్ ఫోన్లు ఉన్న మాట వాస్తవమేనని కొందరు వాదిస్తుండగా, మరికొందరు ఆ వాదనను కొట్టిపారేస్తుండగా, బహుశా అది అద్దం లాంటి వస్తువేదైనా అయి ఉంటుందని చెబుతున్నారు.