దిక్కూ మొక్కూలేని ‘విద్యా హక్కు’!
సందర్భం
విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చి అప్పుడే ఏడేళ్లు పూర్తయింది. 2010 ఏప్రిల్ 1న ఆ చట్టం అమల్లోకి వచ్చిన రోజున అందరూ ఎంతో సంతోషిం చారు. ఎందుకంటే స్వాతంత్య్రానం తరం సంపూర్ణ అక్షరాస్యత సాధనే లక్ష్యంగా అనేక పథకాలు రూపొందించి అమలు చేశారు. ఈ పథకాలు–ఆపరే షన్ బ్లాక్ బోర్డు, డీపీఈపీ, సర్వశిక్షా అభియాన్, ఆర్ఎంఎస్ఏ ఆశించిన ఫలితాలనివ్వలేదు. ఈ అను భవాల తర్వాత విద్యా హక్కు చట్టం తీసుకొచ్చారు. కానీ ఇది సైతం అలంకారప్రాయంగా మిగిలిపోవడం విచారకరమైన వాస్తవం.
విద్యా హక్కు చట్టం కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తామని, లక్షలాదిమంది ఉపాధ్యాయులను నియమిస్తామని ఆనాటి యూపీఏ ప్రభుత్వం చెప్పినప్పుడు అందరూ హర్షించారు. నిధులు, నియామకాల సంగతలా ఉంచి ప్రైవేటు విద్యా సంస్థల్లో నిరుపేద వర్గాల పిల్లలకు 25 శాతం సీట్లు కేటాయించాలన్న నిబం ధనే అమలు కావడం లేదు. ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ఒక సర్వే ప్రకారం ఢిల్లీలో 44.61 శాతం, ఉత్తరాఖండ్లో 31.96 శాతం, మహారాష్ట్రలో 17.87 శాతం, ఉత్తరప్రదేశ్లో 0.79 శాతం సీట్లు మాత్రమే నిరుపేద పిల్లలకు ఇచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రా లతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఈ మాత్రమైనా అమలు కావడం లేదు. 25 శాతం సీట్ల కేటాయింపు రాజ్యాంగ సమ్మతమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఇదే పరిస్థితి. విద్యాహక్కు చట్టం అమలు కోసం కేంద్రం ఇస్తున్న నిధులు 33 శాతం మురిగిపోయాయి.
ప్రథమ్ ఫౌండేషన్ వారి ఏసర్–2016 సర్వే చూస్తే ఎవరికైనా కళ్లు తిరుగుతాయి. దేశంలో కేరళ(9 శాతం), గుజరాత్(7 శాతం) లలో మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య పెరి గింది. అందుకు భిన్నంగా ఉత్తరాఖండ్లో 4 శాతం, అరుణాచల్ 5 శాతం, అస్సాంలో 4.7 శాతం విద్యార్థులు మాత్రమే ప్రైవేటు విద్యా సంస్థల్లో అదనంగా చేరారు. జాతీయ స్థాయిలో అక్షరాస్యత సగటు 69 శాతం ఉండగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అది 67 శాతం మాత్రమే. ఇక మధ్యలో బడి మానేస్తున్న పిల్లలు ఆంధ్ర ప్రదేశ్లో 58.9 శాతమైతే, తెలంగాణలో అది 67.2 శాతం. ప్రభుత్వ విద్యా సంస్థల పతనంలో దేశంలోనే తెలుగు రాష్ట్రాలు రెండూ ముందంజలో ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలలు ఇలా ఉంటే ఆ ప్రభుత్వాల ఆధ్వర్యం లోనే నడుస్తున్న గురుకుల పాఠశాలలు గత 45 ఏళ్లలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నాయి. గ్రామీణ పేద పిల్లలకు ఉన్నత ప్రమా ణాలతో ఉచిత విద్యనందిస్తున్న వీటిని ప్రోత్సహించకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ప్రభుత్వాలు వేర్వేరు గురుకుల పాఠ శాలలు నెలకొల్పాయి. అవి సైతం మంచి ఫలితాలే సాధిస్తు న్నాయి. అయినా ఈ పాఠశాలల సంఖ్యను పెంచడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న 11,000 జిల్లా పరిషత్ పాఠశాలల్లో 5 లక్షలమంది ఉపాధ్యాయులున్నారు. కోటి 30 లక్షల మంది విద్యా ర్థులున్నారు. వీటన్నిటినీ గురుకుల విద్యాసంస్థలుగా మారిస్తే ఒక్క పైసా అదనపు ఖర్చు లేకుండా ఇవి సైతం అద్భుత ఫలితాలు సాధించడానికి ఆస్కారం ఉంటుంది. మాజీ ప్రధాని పీవీ నరసిం హారావు 1971లో ఈ గురుకుల పాఠశాల వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. అవి సాధిస్తున్న ఫలితాల స్ఫూర్తితో 1986లో దేశ వ్యాప్తంగా స్థాపించిన నవోదయ విద్యాలయాలు... లక్షలాది గ్రామీణ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో గతంకన్నా మౌలిక సదుపాయాలు పెరిగాయి. అక్కడ నిష్ణాతులైన ఉపాధ్యాయులున్నారు. రెండు రాష్ట్రాలూ ఏటా రూ. 25,000 కోట్లు ఖర్చుపెడుతున్నాయి. కేంద్రం నుంచి వచ్చే నిధుల్ని వెదజల్లడం, నెలనెలా ఉపాధ్యాయు లకు జీతాలివ్వడం మినహా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేం దుకు తెలుగు రాష్ట్రాలు చొరవ ప్రదర్శించడం లేదు. జిల్లా పరిషత్ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు నిర్వహణ, పర్యవేక్షణ లోపంతో పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. ప్రైవేటు విద్యాసంస్థల అధిపతులు ప్రజాప్రతినిధులై.. గ్రామీణ నిరుపేద విద్యార్థులకు తీరని అన్యా యం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కొంతలో కొంత నయం. 103 గురుకుల పాఠశాలలు, 30 మహిళా డిగ్రీ గురుకుల కళాశాల లను కొత్తగా ప్రారంభించింది. విద్యార్థుల ఉపకార వేతనాలను పెంచింది. వృత్తి విద్యా కళాశాలలను నియంత్రించింది. ప్రాథమిక విద్య నుంచి ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మౌలిక వసతుల కల్పనకు ఉదారంగా నిధులిచ్చింది. ఇందుకు భిన్నంగా ఏపీ సర్కారు వచ్చే విద్యా సంవత్సరం నుంచి 30మందికన్నా తక్కువ విద్యార్థులున్న ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రంగం సిద్ధం చేసింది.
ఈ దుర్మార్గమైన స్థితి మారాలి. పాఠశాల విద్య నిర్వహణను కనీస బాధ్యతగా భావించి, వాటి ఉజ్వల భవిష్యత్తుకు పటిష్టమైన పునాదులు వేయాలి. జడ్పీ పాఠశాలలను గురుకుల పాఠ శాలలుగా మార్చి సంక్షేమ హాస్టళ్లను రద్దు చేయాలి. ఎల్కేజీ నుంచి 5వ తరగతి వరకూ ప్రభుత్వాలే విధిగా పాఠశాలలు నడపాలి. అవి అన్ని సామాజిక వర్గాల విద్యార్థులు కలిసి చదువుకునేలా ఉండాలి. ఒక్క పైసా అదనపు ఖర్చు లేకుండా ఈ పనులన్నీ చేయ వచ్చు. బడుగు విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగేలా తీర్చిదిద్ద వచ్చు. ప్రభుత్వాలు ఆలోచిస్తాయా?
- యం. రోజా లక్ష్మి
వ్యాసకర్త సోషల్ అవేర్నెస్ క్యాంపెయిన్ కార్యకర్త
మొబైల్ : 94410 48958