పెద్ద మాదిగనవుతానంటూ చెప్పి ...
అనంతపురం : ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన ప్రకటన చేసి అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఎన్జీఓ హోంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికల ముందు చంద్రబాబు ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగను అవుతానంటూ చెప్పి మాదిగల ఓట్లతో గెలిచి... ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణపై చిన్న చూపు చూస్తున్నడని ఆరోపించారు.
టీడీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంత వరకు ఎస్సీ వర్గీకరణపై బాబు ఎలాంటి ప్రకటన చేయకపోవడం దురదృష్టకమన్నారు. ఈ అంశంపై చర్చకు వెంటనే అఖిల పక్షం సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 27నుంచి దశల వారిగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈనెల 31నుంచి ఆగస్టు 3 వతేదీ వరకు అన్ని తహసీల్ధార్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఎమ్మార్పీస్ కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బీసీ అర్ దాస్, పెద్ద ఓబిలేసు, గంగాధర్, ఓబయ్య, జయరామ్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.