తెలంగాణలో తుగ్లక్ పాలన
డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం
ఎల్కతుర్తి: తెలంగాణ రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోడీ సభలో ప్రజాసమస్యలను లేవనెత్తుతారన్న అభద్రతాభావంతో కాంగ్రెస్ నాయకులను అడ్డుకుని అరెస్టులు చేసిన హీనమైన చరిత్ర కేసీఆర్ ప్రభుత్వానిదేనని అన్నారు. ప్రజాసమస్యలను ఎత్తిచూపేవారిని తీవ్రవాదులవలే పరిగణనలోకి తీసుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. సారా బ్రాందీ అమ్మకాలతో ఆదాయం పెంచుకుని పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. ప్రజా ఉద్యమంతోనే గద్దెనెక్కిన కేసీఆర్ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తున్న ప్రజలను అణగదొక్కుతున్నాడని పేర్కొన్నారు. బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్లుమార్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నా ఆ పార్టీ నాయకులు దద్దమ్మలవలే చూస్తున్నారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, జెడ్పీటీసీ చల్లా ప్రగతిరెడ్డి, వైస్ ఎంపీపీ కడారి సదానందం, పార్టీ మండల అధ్యక్షుడు సుకినె సంతాజీ పాల్గొన్నారు.