రోజూ రకరకాల పాత్రలు... వేర్వేరు నిర్ణయాలు!
మా తాతగారు ఎం.ఎస్. రెడ్డి గారు, మా నాన్న గారు శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి గారు - ఇద్దరూ చిత్ర నిర్మాణంలో చాలా కాలంగా ఉండడం వల్ల ‘మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్’ ద్వారా టీవీ సీరియల్స్, షోల నిర్మాణ రంగంలో నా ప్రవేశం చాలా సులభంగా జరిగిందని అనుకుంటారు. కానీ, కాదు. ఏ రంగంలోనైనా మహిళ ముందుకు రావాలంటే, తల్లితండ్రుల నుంచి, భర్త నుంచి కుటుంబ పరంగా చాలా మద్దతు ఉండాలి. అందరూ చెప్పే విషయం అనుకున్నా సరే, ఇది పచ్చి నిజం. నేను ఈ రంగానికి వస్తానన్నప్పుడు మా కుటుంబమంతా మొదట వ్యతిరేకించారు. కానీ, మా నాన్న గారు సపోర్ట్ చేశారు.
టీవీ, సినిమాలనే కాదు... ఎక్కడ ఆడవాళ్ళు ముందడుగు వేయాలన్నా మొదట చాలా ఇబ్బందులు ఉంటాయి. ఒక్కసారి గాడిలో పడ్డాక, ఇక అంతా సజావుగా ముందుకు నడుస్తుంది. నాకూ మొదట చాలా ఇబ్బందులు వచ్చాయి. పరిమిత బడ్జెట్‌తో, రోజు వారీగా పని చేయాల్సిన టీవీ రంగానికి తగ్గ సరైన టీమ్‌ను సమకూర్చుకోవడం కొంత ఇబ్బంది అయింది. అలాగే, మొదట్లో మేము తీసిన సీరియల్‌ను కొద్దివారాలకే టీవీ చానల్ నుంచి తొలగించారు. బెంగాలీ సీరియల్‌కు రీమేక్‌గా తీసిన ‘శ్రావణ మేఘాలు’ ఆదరణ పొందలేదు. అలా పాఠాలెన్నో నేర్చుకున్న తరువాత ‘తూర్పు వెళ్ళే రైలు’ సీరియల్ నుంచి, గేమ్ షో ‘ఢీ’ నుంచి విజయాల బాటలోకి వచ్చాం. తరువాత ‘జీన్స్’, ‘క్యాష్’, ‘జబర్దస్త్’ లాంటి హిట్ షోలు చాలా చేశాం. ‘ఢీ’ ఇప్పుడు 7వ సీజన్ నడుస్తోంది. ‘జబర్దస్త్’ సిరీస్‌లు ఎంత పాపులరో చెప్పనక్కర్లేదు.
పెళ్ళి కానప్పుడు మీరు తెల్లవార్లూ కష్టపడగలుగుతారు. కానీ, ఒకసారి తల్లి అయ్యాక పిల్లల బాధ్యత కూడా మీ మీద ఉంటుంది. రెండేళ్ళ క్రితం బాబు పుట్టాక ఆ సంగతి నాకు అర్థమైంది. అందుకే, వర్కింగ్ ఉమన్ అంటే నాకెంతో గౌరవం. మగవాళ్ళతో పోలిస్తే, ఆడవాళ్ళు ఒక తల్లిగా, చెల్లిగా, కూతురిగా, భార్యగా - ఏకకాలంలో చాలా పాత్రలు పోషించాల్సి ఉంటుంది. ఈ పాత్రలకు తగ్గట్లు ఒకే రోజు విభిన్నమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉంటాయి కాబట్టే, ఒకే పని స్త్రీ, పురుషులిద్దరికీ ఇస్తే - ఆడవాళ్ళు ఒక అడుగు ఎక్కువే కష్టపడాల్సి ఉంటుంది. కానీ, ఆధునిక మహిళలు దీన్ని ఒక సవాలుగా తీసుకొని, ముందుకు వస్తున్నారు. మా చెల్లెలు డాక్టర్ మైత్రి కూడా గైనకాల జిస్ట్గా పేరు తెచ్చుకుంటోంది. ఇలాంటి మహిళల విజయాలన్నీ గుర్తు చేసుకోవ డానికీ, మన జీవితంలో మనకు మార్గదర్శకులుగా నిలిచిన అమ్మనూ, అక్కనూ, అత్తనూ, టీచర్లనూ అందరినీ పలకరించి, వారికి కృతజ్ఞత చెప్పుకోవడానికి ఈ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ చక్కటి అవకాశం. ప్రపంచాన్ని మరింత అందంగా, ఆహ్లాదంగా మార్చిన మహిళామూర్తులందరికీ శుభాకాంక్షలు! - దీప్తీరెడ్డి, టీవీ షోలు, సీరియళ్ల నిర్మాత ( ‘జబర్దస్త్’, ‘ఢీ’ ఫేమ్)