MSF leader
-
స్థానికులకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి
తుంగతుర్తి : స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంఎస్ఎఫ్ నియోజకవర్గ ఇన్చార్జ్ తడకమల్ల రవికుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులో మాట్లాడారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే వారు నియోజకవర్గంపై అవగాహనలేక అభివృద్ధికి కృషి చేయడంలేదని అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్ఎఫ్ నాయకులు కొండగడ్పుల శ్రీకాంత్, రాంబాబు, నరేష్, వెంకటేష్, సురేష్, పరశురాములు, శ్రీను, మహేష్ పాల్గొన్నారు. -
లుంగీ చేత పట్టుకొని పరుగో పరుగు!
రాజకీయ నాయకుడు కావాలనుకునే వ్యక్తి చాలా తెలివిగా ఉండాలి. ఆందోళనలో కార్యకర్తలను ముందుండి నడిపించాలి. కానీ పరిస్థితి పోలీసుల దాకా వస్తే.. కార్యకర్తల్ని వదిలేసి.. అందరి కన్నా ముందు తానే తెలివిగా తప్పించుకోవాలి.. ఇది చాలామంది రాజకీయ నాయకులకు తెలిసిన విద్యేనని అంటారు. మొన్నామధ్య వచ్చిన ఓ మలయాళీ సినిమా చూసిన కేరళ వాసులు ఇది నిజమే అనుకున్నారు. కానీ తాజాగా వారు ఇలాంటి ఘటనను ప్రత్యక్షంగా చూసి కచ్చితంగా నిర్ధారించుకున్నారు. ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఎంఎస్ఎఫ్) ఇటీవల కేరళ డిప్యూటీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందజేయడంలో జాప్యాన్ని నిరసిస్తూ వారు ఈ ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనకు ఎంఎస్ఎఫ్ నాయకుడు సయెద్ షరాఫుద్దీన్ జిఫ్రి థంగల్ నేతృత్వం వహించారు. సోషల్ మీడియాలో చిన్నపాటి ప్రముఖుడైన షరాఫుద్దీన్ మాట్లాడుతూ తాము చట్టాన్ని గౌరవిస్తామని, హింస తమ విధానం కాదని చెప్పాడు. అంతేకాకుండా పాఠ్యపుస్తకాలు పంపిణీ చేసే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని మీడియా ముందు కుండబద్దలు కొట్టాడు. ఇదిలా ఉండగానే కొంతమంది వెనుకగేటు నుంచి కార్యాలయంలోకి ప్రవేశించి డిప్యూటీ డైరెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. మరికొందరు గేటులోని దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో చాలావరకు లుంగీల్లో వచ్చిన ఎంఎస్ఎఫ్ నేతల్ని, కార్యకర్తల్ని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు. కొందరు కార్యకర్తలు పోలీసు లాఠీ రుచి కూడా చూశారు. ఇంతలో ఓ నాయకుడు మాత్రం లుంగీ చేత పట్టుకొని పోలీసులకు దొరకకుండా పరుగో పరుగు తీశాడు. పోలీసులకు దొరకకుండా శాయశక్తులు ఉపయోగించి.. ఉసేన్ బోల్ట్ కు ఏమాత్రం తీసిపోని రీతిలో అతడు పెట్టిన పరుగులు మీడియా కంటపడ్డాయి. అతనే ఈ ఆందోళనకు నేతృత్వం వహించిన షరాఫుద్దీన్. రిపోర్టర్ టీవీ యూట్యూబ్లో పెట్టిన అతని పరుగు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అన్నట్టు రాజకీయాలు నేపథ్యంగా వచ్చిన 'ఓరు ఇండియన్ ప్రనాయకథా' సినిమాలోనూ ఓ ఆందోళనకు నేతృత్వం వహించిన హీరో.. అది కాస్తా హింసాత్మకంగా మారి.. కార్యకర్తల్ని పోలీసులు చితకబాదుతుండటంతో అతను మాత్రం తెలివిగా పరుగులు పెట్టి తప్పించుకుంటాడు. ఇప్పుడు షరాఫుద్దీన్ కూడా అచ్చం అలాగే తప్పించుకోవడంతో ఇద్దరిని పోల్చి నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.