చరణ్ డబుల్ సెంచరీ
ఎంసీసీపై గెలాక్సీ ఘనవిజయం
ఎ2-డివిజన్ రెండు రోజుల లీగ్
సాక్షి, హైదరాబాద్: గెలాక్సీ బ్యాట్స్‌మన్ ఎంఎస్ఆర్ చరణ్ (202 నాటౌట్) డబుల్ సెంచరీతో చెలరేగడంతో ఎంసీసీపై ఆ జట్టు 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఎ-2 డివిజన్ రెండు రోజుల లీగ్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గెలాక్సీ మూడు వికెట్ల నష్టానికి 354 పరుగుల భారీ స్కోరు సాధించింది. చరణ్‌కు తోడు యశ్ కపాడియా (57) రాణించాడు. అనంతరం లక్ష్యఛేదనలో ఎంసీసీ జట్టు 247 పరుగులకే ఆలౌటైంది. అనురాగ్ హరిదాస్ (60), ప్రిన్స్ ఓజా (55)లు అర్ధసెంచరీలు సాధించినా.. ఇతర బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. గెలాక్సీ బౌలర్లు భరత్ రాజ్ (4/58), సుమిత్ జోషి (3/46) రాణించి ఎంసీసీ వెన్నువిరిచారు.
మెగా సిటీ గెలుపు
ఆక్స్ఫర్డ్ బ్లూస్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో మెగా సిటీ జట్టు 60 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన మెగా సిటీ.. సొహైల్ (107) సెంచరీకి తోడు శ్రీకర్ (86) రాణించడంతో 298 పరుగుల స్కోరు చేసింది. అయితే ఆక్స్ఫర్డ్ బ్యాట్స్‌మన్ అమిత్‌సింగ్ (107) సెంచరీ సాధించినా లక్ష్యఛేదనలో విఫలమైన ఆ జట్టు 238 పరుగులకే ఆలౌటైంది. మెగా సిటీ బౌలర్ ఎన్. అనిరుధ్ (4/62) రాణించాడు. మరో మ్యాచ్‌లో నేషనల్ జట్టు 9 వికెట్ల తేడాతో సాయి సత్య జట్టు చేతిలో ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన నేషనల్ జట్టు 110 పరుగులకే కుప్పకూలింది. సాయి సత్య జట్టు బౌలర్ విశ్వనాథ్ (5/33) రాణించాడు. అనంతరం సాయిసత్య జట్టు వికెట్ మాత్రమే కోల్పోయి 114 పరుగులు చేసి గెలిచింది. ఎల్. సతీష్‌రెడ్డి అర్ధసెంచరీ (62 నాటౌట్)తో జట్టును గెలిపించాడు.
రాణించిన మజీద్
అంతర్ జిల్లా రెండు రోజుల లీగ్ చాంపియన్‌షిప్‌లో నల్లగొండ బ్యాట్స్‌మన్ ఎస్.కె. మజీద్ అర్ధసెంచరీ (88 నాటౌట్)తో రాణించాడు. ఆదిలాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలిరోజు ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం ఆదిలాబాద్ 178 పరుగులకు ఆలౌటైంది. మరో మ్యాచ్‌లో మెదక్ 7 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేయగా... కరీంనగర్ 8 వికెట్లు కోల్పోయి 161 పరుగులు చేసింది.