MT Krishna Babu Chairman
-
విశాఖ పోర్టు లాభం రూ. 200 కోట్లు
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నం పోర్టు గడిచిన ఐదేళ్లలో ఆర్థిక, నైపుణ్యత, మౌలిక సదుపాయాలు తదితర అన్ని రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించిందని పోర్టు ట్రస్ట్ చైర్మన్ ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఐదు శాతం వృద్ధి రేటు సాధించడమే కాకుండా దేశంలోనే శుభ్రమైన పోర్టుగా వరుసగా మూడేళ్లు జాతీయ స్థాయిలో రెండో స్థానంలో నిలిచిందన్నారు. గ్రీన్ ఇండస్ట్రీ, గ్రీన్ పోర్టు అవార్డులను కూడా సొంతం చేసుకుందని చెప్పారు. పోర్టు అభివృద్ధి కోసం తన హయాంలో చేపట్టిన కార్యక్రమాలను కృష్ణబాబు శుక్రవారం విశాఖలో మీడియాకు వివరించారు. 2017–18లో 63.54 మిలియన్ టన్నుల మేర ఎగుమతులు, దిగుమతులు జరిగితే 2018–19లో 65.3 మిలియన్ టన్నులకు పెరిగాయని, తద్వారా రూ. 200 కోట్ల లాభాలను ఆర్జించి పోర్టు రికార్డు నెలకొల్పిందని తెలిపారు. రూ. 300 కోట్ల ఖర్చుతో పోర్టు ఛానల్ లోతును 11 మీటర్ల నుంచి 14.5 మీటర్లకు పెంచామని, దీనివల్ల లక్ష టన్నులకు మించిన నౌకలు కూడా ఇన్నర్ హార్బర్లలోకి వచ్చే వెసులుబాటు కలిగిందని చెప్పారు. 85 ఏళ్ల కిందట ఏర్పడిన పోర్టును ప్రస్తుత టెక్నాలజీకి అనుగుణంగా ఆధునికీకరిస్తున్నామని, ఇందుకోసం విశాఖ పోర్టు ట్రస్ట్ రూ. 1,200 కోట్లు ఖర్చు చేస్తే, ప్రైవేటు సెక్టార్ నుంచి రూ. 2,500 కోట్లు పెట్టుబడులు పెట్టారన్నారు. విలాసవంతమైన భారీ క్రూయిజ్‌ల నిర్మాణం కోసం రూ. 77 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. పోర్టు కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు కాన్వెంట్ కూడలి నుంచి సీ హార్స్ జంక్షన్ వరకు 7.5 మీటర్ల ఎత్తులో రక్షణ గోడ నిర్మించామని వివరించారు. కాలుష్య నియంత్రణ కోసం గడిచిన 8 ఏళ్లలో రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు కింద పోర్టు రోడ్డును నాలుగు వరుసలకు విస్తరించడంతో పాటు షీలానగర్ నుంచి సబ్బవరం వరకు కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారికి అనుసంధానమయ్యేలా పనులు జరుగుతున్నాయన్నారు. -
2015కల్లా విశాఖ పోర్టుకు భారీ నౌకలు
విశాఖపట్నం, న్యూస్‌లైన్: విశాఖ పోర్టుకు పూర్వ వైభవ ం తీసుకొచ్చే దిశగా శర వేగంగా అభివృద్ది పనులు చేపడుతున్నామని చైర్మన్ ఎంటి కృష్ణబాబు చెప్పారు. పోర్టు చైర్మన్‌గా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ. 2500 కోట్ల పెట్టుబడులతో పోర్టు అభివృద్ది పనులు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ పూర్తి కావాలంటే 2015 వరకూ ఆగాల్సిందేనని అప్పుడే భారీ నౌకలకు చోటు కల్పించే అవకాశం వుందన్నారు. డ్రెడ్జింగ్ పనులు, మెకనైజ్డ్ పనులే కీలకంగా వున్నందున వాటిపైనే ఎక్కువ దృష్టి సారిస్తామన్నారు. పోర్టు ఆధునికీకరణలో భాగంగా ఇప్పటికే మంజూరైన పనులన్నీ నిర్ణీత వేళలో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రైవేట్ పోర్టులతో సమానంగా ప్రస్తుత రోజుల్లో పరుగెత్తడం సాధ్యం కానందున మౌళికవసతులన్నీ సమకూర్చుకుని పూర్వ వైభవానికి బాటలు వేస్తామని చెప్పారు. కార్గో రవాణాలో పోటీ ఎక్కువగా వున్నందున పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్దతిలో కలిసి వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నామని తెలిపారు. గత మూడేళ్లుగా పోర్టు ఆదాయం తగ్గుతోందని అందుకు డ్రెడ్జింగ్ పనులు లేకపోవడమేనన్నారు. భారీ నౌకలు వచ్చే అవకాశం లేక ఆదాయానికి గండిపడుతోందన్నారు. కొత్తగా వచ్చిన గంగవరం, కృష్ణపట్నం పోర్టుల్లో ఒకే ప్లాట్‌ఫారంపై ఆరు నౌకలు వుండే అవకాశం వుందని అందుకే అక్కడ రెవెన్యూ పెంచుకోగలుగుతున్నారని చెప్పారు.రానున్న ఆగష్టు మాసం నాటికి రూ. 230 కోట్లు ఖర్చు చేసి 16.1 మీటర్ల డ్రెడ్జింగ్ పూర్తి చేయాలనుకుంటున్నామని చెప్పారు. కనీసం 10 నుంచి 14 మీటర్ల డ్రెడ్జింగ్ చేయకపోతే ఇప్పటి వరకూ చేసిన డ్రెడ్జింగ్ అంతా వృధా అయ్యే అవకాశం వుందని వెల్లడించారు. లూజ్ సాయిల్ కావడంతో డ్రెడ్జింగ్ పనులు త్వరితగతిన పూర్తవుతాయని భావిస్తున్నామన్నారు. పోర్టులోనికి ప్రవేశించే ద్వారం వద్ద డ్రెడ్జింగ్ పూర్తయిన తర్వాతే మార్కెటింగ్‌పై దృష్టి సారిస్తామన్నారు.