భూనిర్వాసితుల సమస్యలపై పాదయాత్రలు
2013 చట్టం ప్రకారమే ముచ్చర్ల ఫార్మాసిటీ భూసేకరణ: సీపీఎం డిమాండ్
సాక్షి, హైదరాబాద్ : వివిధ జిల్లాల్లో చేపడుతున్న ప్రాజెక్టుల పరిధుల్లోని నిర్వాసితుల సమస్యలపై జూలై నెల మొత్తం పాదయాత్రలను చేపడుతున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ నెల 7-9 తేదీల్లో ఉద్దండాపూర్ రిజర్వాయర్ పరిధిలో పాలమూరు ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై, 12, 13 తేదీల్లో కరీంనగర్ జిల్లా మిడ్‌మానేరు పరిధిలోని గౌరవల్లి, 14న ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం సింగరేణి ఓపెన్‌కాస్ట్, 17-19 తేదీల్లో ముచ్చర్ల ఫార్మాసిటీ పరిధిలోని భూనిర్వాసితుల సమస్యలపై పాదయాత్రలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
మంగళవారం ఇక్కడ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి బొంతల చంద్రారెడ్డి, మైదాన ప్రాంత గిరిజన సంఘం కార్యదర్శి జి.ధర్మానాయక్లతో కలసి సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యుడు, భూనిర్వాసితుల కమిటీ కన్వీనర్ బి.వెంకట్ విలేకరులతో మాట్లాడారు. ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం 2013 భూసేకరణ చట్టం ప్రకారమే పరిహారం, పునరావాస ప్యాకేజీలను చెల్లించి రైతుల నుంచి భూమిని సేకరించాలని డిమాండ్ చేశారు. ముచ్చర్ల ఫార్మాసిటీ కోసం జీవో 123 కింద సేకరించిన భూమి వల్ల స్థానిక రైతులకు రూ.400 కోట్ల మేర నష్టం కలిగిందని, ఉపాధి పరిహారం ఇవ్వకపోవడం వల్ల మరో రూ.వంద కోట్లు నష్టపోయారని తెలిపారు.