సీఎం రాచకొండ పర్యటన రద్దు
⇒ ముచ్చర్ల పర్యటనకే పరిమితం
⇒ దేశంలోని 20మంది ఫార్మా దిగ్గజాలతో కలిసి ఏరియల్ సర్వే
⇒ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయనున్న యంత్రాంగం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: రాచకొండ భూముల్లో సీఎం కేసీఆర్ పర్యటన రద్దయ్యింది. ముచ్చర్ల పర్యటనకు ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. ఫిల్మ్‌సిటీ ఏర్పాటు నేపథ్యంలో కేసీఆర్ బుధవారం ఏరియల్ సర్వే కోసం రాచకొండ గుట్టల్లో పర్యటించాల్సి ఉంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌తోపాటు ఇతర అధికార యంత్రాంగం కొన్ని రోజులుగా సీఎం పర్యటన ఏర్పాట్లలో తలమునలైంది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష కూడా నిర్వహించారు.
అన్ని ఏర్పాట్లు పూర్తయిన తర్వాత సీఎం పర్యటన రద్దు కావడంతో అధికార యంత్రాంగం నిరాశకు లోనయింది. అయితే ఫార్మాసిటీ ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం కోసం బుధవారం కందుకూరు మండలంలోని ముచ్చర్లలో కేసీఆర్ పర్యటించనున్నారు. దాంతో రాచకొండ పర్యటన రద్దు చేశారు. ఈ మేరకు సోమవారం సీఎం కార్యాలయం జిల్లా కలెక్టర్‌కు తెలియజేసింది. దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీల అధినేతలు 20మందికిపైగా ముచ్చర్లకు రానున్నారు.
ఈ క్రమంలో సీఎం ఎక్కువ సమయంలో ముచ్చర్లలో ఫార్మా కంపెనీల దిగ్గజాలతో గడపనున్నారు. ఆమనగల్లులో ఫార్మాసిటీ కోసం సుమారు 2వేల ఎకరాలను ప్రాథమికంగా గుర్తించారు. జిల్లా అధికారులు అంతా ఇప్పుడు ముచ్చర్లలో ఏర్పాట్లపై దృష్టిసారించారు. ఫార్మాసిటీ కోసం ఇక్కడ సీఎం ఫార్మా అధినేతలతో కలిసి ప్రభుత్వ భూములను పరిశీలించనున్నారు. అనంతరం అక్కడ యంత్రాంగం ఏర్పాటు చేసే ఫొటో ప్రదర్శనను తిలకించనున్నారు. ఆ తర్వాత సీఎం కేసీఆర్ రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వ హించనున్నారు.