కురులు... వివరాల విరులు
ట్రివియా
అరచేతులు, అరికాళ్లు, పెదవులు, మ్యూకస్ పొరలు తప్ప శరీరంలోని మిగిలిన అన్ని భాగాల్లోనూ వెంట్రుకలు పెరుగుతాయి. ఎముకల్లోని మూలగ తర్వాత అత్యంత వేగంగా పెరిగే కణజాలం జుట్టు మాత్రమే. మనిషి తలపై సగటున లక్ష వరకు వెంట్రుకలు ఉంటాయి. తల వెంట్రుకల్లో 90 శాతం పెరుగుతూ ఉంటే, 10 శాతం విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి.
తలపై లక్ష వరకు ఉండే వెంట్రుకల్లో రోజూ వంద వరకు వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. పురుషుల్లో సగం మందికి యాభయ్యేళ్ల లోపు వయసులోనే బట్టతల వస్తుంది. థైరాయిడ్ సమస్యల వల్ల, ఐరన్ లోపం వల్ల తాత్కాలికంగా తలపై వెంట్రుకలు పలచబడతాయి. అలాగే, కొన్ని రకాల ఔషధాల ప్రభావం వల్ల కూడా తల వెంట్రుకలు గణనీయంగా రాలిపోతాయి.
వెంట్రుకల ఆయుర్దాయం మూడు నుంచి ఏడేళ్లు. పోషకాలతో నిండిన ఆహారం తీసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి. గుడ్లు, చేపలు, లివర్, కిడ్నీలు, ఆకు కూరలు, ఆకుపచ్చని కూరగాయలు వంటివి జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు దోహదపడతాయి.జుట్టులోని పిగ్మెంట్స్ కారణంగానే జుట్టుకు రంగు ఏర్పడుతుంది. వయసు మళ్లే దశలో పిగ్మెంట్స్ తగ్గడం కారణంగా జుట్టు నెరుస్తుంది.వెంట్రుకలు గరిష్టంగా 90 సెం.మీ. వరకు పెరుగుతాయి. ఏడాది వ్యవధిలో వెంట్రుకల పెరుగుదల 12 సెం.మీ. వరకు ఉంటుంది.