తాజ్ మహల్‌కు ప్రకృతి చికిత్స!
న్యూఢిల్లీ: మన ముఖ వర్చస్సు తగ్గితే ఏం చేస్తాం... కొంత మంది అయితే, ఏవేవో ఫేస్‌ప్యాక్‌లు వేసుకుంటారు. కొందరు సహజసిద్ధంగా ముల్తానా మట్టిని ముఖంపై ప్యాక్‌లా వేసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవడం చేస్తారు. దీనివల్ల వారి ముఖంలో కొత్త వెలుగు వస్తుంది. అచ్చం అలాగే, ప్రముఖ కట్టడం తాజ్ మహల్‌కు బురదమన్నుతో త్వరలోనే చిక్సిత చేయనున్నారు. పెరిగిపోయిన కాలుష్యం కారణంగా తాజ్‌మహల్ పాలరాతి అందాలు పసుపురంగులోకి మారుతున్నాయి. దీంతో కాలుష్యాన్ని తొలగించేందుకు భారత పురావస్తు విభాగం రంగంలోకి దిగింది. తాజ్‌మహల్ సహజ అందాలను తిరిగి తీసుకొచ్చేందుకు మడ్పాక్(మట్టిపూత)తో చికిత్స చేసేందుకు సన్నాహాలు ప్రారంభించినట్లు పురావస్తు విభాగం ఉన్నతాధికారి బీఎమ్ భట్నాగర్ తెలిపారు. దీనికి సంబంధించిన ఆయన మరిన్ని వివరాలు తెలిపారు.
నిమ్మగుణం అధికంగా ఉన్న మట్టిని తాజ్ మహల్‌పై, తెల్లదనం తగ్గిన చోట పూతలా వేస్తారు. ఆరిన తర్వాత మట్టిపూతను తీసివేస్తారు. అనంతరం మెత్తటి నైలాన్ బ్రష్‌లతో డిస్టిల్డ్ వాటర్ సాయంతో ఆయా ప్రాంతాల్లో కడుగుతారు. 17వ శతాబ్దానికి చెందిన చెందిన ఈ కట్టడానికి గతంలో ఇలానే మూడు సార్లు చికిత్స చేశారు. 1994, 2001, 2008లో ఇది జరిగింది. 2008లో తాజ్ మహల్ అందాల పరిరక్షణకు 24 మంది నిపుణులు ఆరు నెలల పాటు పనిచేశారు. పర్యాటకుల సందర్శనకు ఇబ్బంది లేకుండా మట్టితో చికిత్స చేసేందుకు ఇంత సమయం తీసుకున్నారు. అప్పుడు రూ. 10.4 లక్షలు ఖర్చయినట్లు భట్నాగర్ వెల్లడించారు.