మణిరత్నం టైటిల్లో విక్రమ్‌ప్రభు
యువ నటుడు విక్రమ్‌ప్రభు తన తాజా చిత్రానికి మంచి పవర్ఫుల్ టైటిల్‌ను దక్కించుకున్నారు. దర్శకుడు మణిరత్నం టైటిల్‌ను తన చిత్రానికి పెట్టుకున్నారు. విక్రమ్‌ప్రభు తాజాగా నటిస్తున్న చిత్రం ముడిచూడ మన్నన్ ఇందులో ఆయనకు జంటగా నటి మంజిమామోహన్ నటిస్తున్నారు. ఇంతకు ముందు సుందరపాండియన్, ఇదు కదిరవేలన్ కాదల్ చిత్రాలను తెరకెక్కించిన ఎస్ఆర్.ప్రభాకరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది.
చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్‌కు సిద్ధం అవుతున్న సమయంలో ముడిచూడ మన్నన్ టైటిల్‌తో దర్శక నిర్మాత కేఆర్ ఒక చిత్రం నిర్మిస్తున్న విషయం తెలిసిందట. దీంతో విక్రమ్‌ప్రభు చిత్రానికి క్షత్రియన్ అనే పవర్ఫుల్ టైటిల్‌ను నిర్ణయించారు. ఇదే టైటిల్‌తో ఇంతకు ముందు దర్శకుడు మణిరత్నం బ్యానర్లో ఇటీవల కన్నుమూసిన సుభాష్ దర్శకత్వంలో విజయకాంత్ హీరోగా చిత్రం వచ్చిందన్నది గమనార్హం. విక్రమ్‌ప్రభు చిత్రానికి యువన్ శంకర్‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. ఇందులో నటి ఐశ్వర్యదత్, కెవిన్ ముఖ్యపాత్రల్లో నటించారు. చిత్రం త్వరలో తెరపైకి రానుంది.