లారీడ్రయివర్ నుంచి స్మగ్లర్ దాకా...
వెంకటరెడ్డి ఎర్రచందనం స్మగ్లర్ వద్ద లారీ డ్రైవర్‌గా చేరాడు. అక్రమ మార్గాలన్నీ తెలుసుకుని కోట్లకు పడగలెత్తాడు. సొంతంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ 32 ఏళ్లుగా అటవీ, పోలీసు అధికారులకు చెమటలు పట్టించాడు. చివరకు రేణిగుంటలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రదక్షిణ చేస్తూ పోలీసులకు శనివారం అడ్డంగా దొరికిపోయాడు.
సాక్షి, తిరుపతి/మంగళం: అటవీ, పోలీసు అధికారులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న ఎర్రచందనం స్మగ్లర్ వెంకటరెడ్డి శనివారం ఎట్టకేలకు పట్టుబడ్డాడు. లారీ క్లీనర్‌గా జీవితం ప్రారంభించి స్మగ్లర్‌గా మారిన అతని అక్రమ వ్యవహారాలకు సంబంధించిన వివరాలను అటవీ అధికారులు వెల్లడించారు. మండల కేంద్రమైన ఎర్రావారిపాళానికి చెం దిన తిమ్మసముద్రం రామిరెడ్డికి వెంకటరెడ్డి, వెంకటశివరామిరెడ్డి, సుబ్రమణ్యంరెడ్డి కుమారులు. వెంకటరెడ్డి, వెంకటశివరామిరెడ్డి రేణిగుంటలోనే కాపురం ఉంటున్నారు.
30 ఏళ్ల క్రితం ఒక్కొక్కరికి రెండెకరాల వ్యవసాయ భూమి ఉండేది. తొలుత లారీ క్లీనర్‌గా జీవితాన్ని ప్రారంభించిన వెంకటరెడ్డి తిరువళ్లూరుకు చెందిన ఎర్రచందనం స్మగ్లర్ నాయుడు వద్ద డ్రైవర్‌గా చేరాడు. రెండేళ్లపాటు లారీ డ్రైవర్‌గా పనిచేశాడు. అతని వేతనంగా ఒక్కో ట్రిప్పునకు రూ.50వేలు తీసుకునేవాడు. బ్రహ్మంగారిమఠం, కోడూరు, కడప, ఆళ్లగడ్డ, నం ద్యాల, తలకోన, భాకరాపేట ప్రాంతాల నుంచి ఎర్రచందనం చెట్లను నరికి అక్రమంగా తరలించేవాడు.
అడవిలో నరి కిన ఎర్రచందనం దుంగలను కర్నూలులోని ఓ గోదాములో దాచేవారు. అక్కడి నుంచి ఢిల్లీకి చేరవేసేవారు. చెన్నైలోని రెడ్‌హిల్స్‌కు చెందిన మణి, సత్యవేడుకు చెందిన మురళి సహకారంతో అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు చేరవేసేవారు. అలా ఎర్రచందనం రవాణాకు అన్ని మార్గాలు తెలుసుకున్న వెంకటరెడ్డి కొంతకాలానికి తానే స్మగ్లర్‌గా అవతారమెత్తాడు. రేణిగుంటలోని శ్రీవెంకటేశ్వరస్వామి గుడిలో శనివారం పూజలు చేస్తూ పట్టుబడ్డాడు.
కోట్లకు పడగలెత్తిన వెంకటరెడ్డి కుటుంబం
స్మగ్లర్‌గా అవతారమెత్తిన వెంకటరెడ్డి కుటుంబం కోట్ల రూపాయల ఆస్తులను సంపాదించింది. రేణిగుంట, తిరుపతి, ఎర్రావారిపాళెం, కర్నూలు, కడప ప్రాంతాల్లో భవ నాలు, అపార్ట్మెంట్లు నిర్మించినట్లు తెలుస్తోంది. వెంకటరెడ్డి పేరుపై రూ.100 కోట్లకుపైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం. అతని సోదరులకు కూడా రూ.50 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఎర్రచందనం అక్రమరవాణా సా గిస్తూనే తాజాగా హైదరాబాద్‌లో బిల్డర్ అవతారమెత్తినట్లు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఎర్రావారిపాళెం నుం చి ఢిల్లీ దాకా ఎర్రచందనం అక్రమరవాణాను విస్తరించినట్లు వెల్లడించాడు. ఈ అక్రమరవాణాలో ఎవరెవరు ఉన్నారు? ఎంత మంది ఉన్నారు? ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారే కీలక సమాచారం సైతం పోలీసులకు వెంకటరెడ్డి వివరిం చినట్లు విశ్వసనీయ సమాచారం.