Muhammad Hafeez
-
'ఇక బౌలింగ్ చేయడం మానుకో'
కరాచీ: అనుమానాస్పద బౌలింగ్ తో పదే పదే సస్పెన్షన్ కు గురువుతున్న పాకిస్తాన్ ఆల్ రౌండర్ మొహ్మద్ హఫీజ్ తన బౌలింగ్ ను వదులుకుంటేనే ఉత్తమమని ఆ దేశ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ సలహా ఇచ్చాడు. ఒక మంచి బ్యాట్స్ మన్ కూడా అయిన హఫీజ్.. బౌలింగ్ గురించి ఆలోచించకుండా ఉండాలంటే దాన్ని విడిచిపెట్టడమే ఉత్తమని సూచించాడు. 'ఇక హాఫీజ్ బౌలింగ్ ను వదులుకోవాలి. అప్పుడే బ్యాటింగ్ పై మరింత ఏకాగ్రత పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. బ్యాటింగ్ పై మాత్రమే ఫోకస్ పెట్టు. హఫీజ్ బౌలింగ్ ఐసీసీ నిబంధనలకు లోబడి లేనప్పుడు దానిపై దృష్టి పెట్టడం ఎందుకు. బౌలింగ్ గురించే పదే పదే పాకులాడుతున్నాడు. అతనికి బ్యాటింగ్ కూడా ఒక ఆయుధం. అటువంటప్పుడు బౌలింగ్ ను మరిచిపో. ఆ క్రమంలోనే బ్యాటింగ్ పై మరింత ఫోకస్ చేస్తే నీ కెరీర్ కు మంచిది'అని అక్రమ్ పేర్కొన్నాడు. కొన్ని రోజుల క్రితం హఫీజ్ అనుమానాస్పద బౌలింగ్ శైలితో మరోసారి బౌలింగ్‌కు దూరమయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ చేయడానికి అతడిని ఐసీసీ అనర్హుడిగా ప్రకటించింది. ఇటీవల అబుదాబి వేదికగా శ్రీలంకతో జరిగిన మూడో వన్డేలో హఫీజ్ బౌలింగ్ యాక్షన్‌పై అంపైర్లు సందేహం వ్యక్తం చేశారు. హఫీజ్ ఆఫ్‌స్పిన్ బౌలింగ్‌పై నిషేధం విధించడం ఇది మూడోసారి .2014 డిసెంబర్లో తొలిసారి ఐదు నెలల నిషేధం ఎదుర్కొన్న హఫీజ్ తర్వాత 2015 జూన్‌లో వివాదాస్పద బౌలింగ్ యాక్షన్‌తో నిషేధం కారణంగా 12 నెలల పాటు బౌలింగ్ చేయలేదు. -
అందరూ నాలాగే ఔటయ్యారు!
కరాచీ: తనకు వ్యతిరేకంగా స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోందని పాకిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ అంటున్నాడు. నేడు ఇంగ్లండ్ తో మూడో టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లండ్ పర్యటనలో ప్రతి బ్యాట్స్ మన్ స్లిప్స్ లో క్యాచిచ్చి ఔటవుతున్నారని, అయితే అందుకు తానేమీ ప్రత్యేకం కాదన్నాడు. తన ఫామ్ గురించి విమర్శిస్తూ పదే పదే తనపై ఒత్తిడి తెస్తున్నారని ఇది మంచికాదని హితవు పలికాడు. విమర్శలను పట్టించుకునే ఉద్దేశం లేదన్నాడు. బంతితో ఎలాగూ రాణించడం లేదు, బ్యాటింగ్ లో ఇన్నింగ్స్ లు ఆడాలని ప్రచారం జరుగుతోందని.. వన్డే, టీ20లకు ఆల్ రౌండర్ గా తన సేవలు అవసరమన్నాడు. నేటి టెస్టు తనకు 50వ టెస్టు అని, తన బ్యాటింగ్ సగటు చూస్తే తానేంటో తెలుస్తుందని హఫీజ్ వ్యాఖ్యానించాడు. మోకాలి గాయం కారణంగా కొన్ని సిరీస్ లకు ఎంపిక కాలేదని ప్రస్తుతం తాను చాలా ఫిట్ గా ఉన్నట్లు తెలిపాడు. ఐసీసీ తనకు క్లీన్ చిట్ ఇచ్చినందున బౌలింగ్‌లో జట్టుకు సేవలు అందిస్తానని ఓ మంచి ఇన్నింగ్స్ ఆడితే మళ్లీ ఫామ్ అందిపుచ్చుకోవడం పెద్ద సమస్యకాదని హఫీజ్ వివరించాడు. -
భారత్ వీసా కోసం హఫీజ్ నిరీక్షణ!
కరాచీ: బౌలింగ్ లో చకింగ్ కు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నపాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ భారత్ వీసా కోసం ఎదురుచూస్తున్నాడు. బౌలింగ్ పరీక్షల్లో భాగంగా హఫీజ్ మంగళవారం చెన్నైలోని ఐసీసీ సంబంధిత బయో మెకానిక్స్ లేబరేటరీకి హాజరు కావాల్సి ఉంది. అనంతరం జూలై 3 వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే మూడో టెస్టు కోసం కొలంబో తిరిగి పయనం కావాల్సి ఉంది. అయితే భారత అధికారుల నుంచి ఇంకా వీసా క్లియరెన్స్ రావపోవడంతో హఫీజ్ అందుకోసం నిరీక్షిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఒకవేళ వీసా రాని పక్షంలో అతని బౌలింగ్ యాక్షన్ నివేదిక సంబంధించి ఐసీసీని మరో 14 రోజుల అదనపు సమయం అడిగినట్లు పీసీబీ తెలిపింది. శ్రీలంకతో తొలి టెస్టులో హఫీజ్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని అంపైర్లు నివేదిక ఇచ్చారు. గత నవంబరులో న్యూజిలాండ్‌తో టెస్టులో ‘చకింగ్’ చేశాడంటూ ఐసీసీ హఫీజ్ బౌలింగ్‌పై నిషేధం విధించింది. అయితే పరీక్షలకు వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఏడాది వ్యవధిలో రెండోసారి హఫీజ్‌పై మళ్లీ ‘చకింగ్’ ఆరోపణ వచ్చింది. దీంతో హఫీజ్ మరోసారి బౌలింగ్ పరీక్షలో పాస్ కావాలి. కాని పక్షంలో ఏడాది నిషేధం విధించే అవకాశం ఉంది.