
భారత్ వీసా కోసం హఫీజ్ నిరీక్షణ!
కరాచీ: బౌలింగ్ లో చకింగ్ కు పాల్పడుతున్నాడంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నపాకిస్థాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ భారత్ వీసా కోసం ఎదురుచూస్తున్నాడు. బౌలింగ్ పరీక్షల్లో భాగంగా హఫీజ్ మంగళవారం చెన్నైలోని ఐసీసీ సంబంధిత బయో మెకానిక్స్ లేబరేటరీకి హాజరు కావాల్సి ఉంది. అనంతరం జూలై 3 వ తేదీ నుంచి శ్రీలంకతో జరిగే మూడో టెస్టు కోసం కొలంబో తిరిగి పయనం కావాల్సి ఉంది. అయితే భారత అధికారుల నుంచి ఇంకా వీసా క్లియరెన్స్ రావపోవడంతో హఫీజ్ అందుకోసం నిరీక్షిస్తున్నట్లు పీసీబీ తెలిపింది. ఒకవేళ వీసా రాని పక్షంలో అతని బౌలింగ్ యాక్షన్ నివేదిక సంబంధించి ఐసీసీని మరో 14 రోజుల అదనపు సమయం అడిగినట్లు పీసీబీ తెలిపింది.
శ్రీలంకతో తొలి టెస్టులో హఫీజ్ బౌలింగ్ యాక్షన్ సందేహాస్పదంగా ఉందని అంపైర్లు నివేదిక ఇచ్చారు. గత నవంబరులో న్యూజిలాండ్‌తో టెస్టులో ‘చకింగ్’ చేశాడంటూ ఐసీసీ హఫీజ్ బౌలింగ్‌పై నిషేధం విధించింది. అయితే పరీక్షలకు వెళ్లి క్లియరెన్స్ తెచ్చుకున్నాడు. ఏడాది వ్యవధిలో రెండోసారి హఫీజ్‌పై మళ్లీ ‘చకింగ్’ ఆరోపణ వచ్చింది. దీంతో హఫీజ్ మరోసారి బౌలింగ్ పరీక్షలో పాస్ కావాలి. కాని పక్షంలో ఏడాది నిషేధం విధించే అవకాశం ఉంది.