
అందరూ నాలాగే ఔటయ్యారు!
కరాచీ: తనకు వ్యతిరేకంగా స్థానిక మీడియాలో ప్రచారం జరుగుతోందని పాకిస్తాన్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ అంటున్నాడు. నేడు ఇంగ్లండ్ తో మూడో టెస్టు ప్రారంభంకానున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడాడు. ఇంగ్లండ్ పర్యటనలో ప్రతి బ్యాట్స్ మన్ స్లిప్స్ లో క్యాచిచ్చి ఔటవుతున్నారని, అయితే అందుకు తానేమీ ప్రత్యేకం కాదన్నాడు. తన ఫామ్ గురించి విమర్శిస్తూ పదే పదే తనపై ఒత్తిడి తెస్తున్నారని ఇది మంచికాదని హితవు పలికాడు. విమర్శలను పట్టించుకునే ఉద్దేశం లేదన్నాడు.
బంతితో ఎలాగూ రాణించడం లేదు, బ్యాటింగ్ లో ఇన్నింగ్స్ లు ఆడాలని ప్రచారం జరుగుతోందని.. వన్డే, టీ20లకు ఆల్ రౌండర్ గా తన సేవలు అవసరమన్నాడు. నేటి టెస్టు తనకు 50వ టెస్టు అని, తన బ్యాటింగ్ సగటు చూస్తే తానేంటో తెలుస్తుందని హఫీజ్ వ్యాఖ్యానించాడు. మోకాలి గాయం కారణంగా కొన్ని సిరీస్ లకు ఎంపిక కాలేదని ప్రస్తుతం తాను చాలా ఫిట్ గా ఉన్నట్లు తెలిపాడు. ఐసీసీ తనకు క్లీన్ చిట్ ఇచ్చినందున బౌలింగ్లో జట్టుకు సేవలు అందిస్తానని ఓ మంచి ఇన్నింగ్స్ ఆడితే మళ్లీ ఫామ్ అందిపుచ్చుకోవడం పెద్ద సమస్యకాదని హఫీజ్ వివరించాడు.