నిరుపేదలూ ఇఫ్తార్ ఇవ్వొచ్చు
ఇస్లాం వెలుగు
‘రమజాన్’ అత్యంత శుభప్రదమైన, పుణ్యప్రదమైన మహామాసం. ఈ పవిత్ర మాసం మరికొన్ని రోజులు ఉందనగానే మమతలమూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) విశ్వాసుల సమాజాన్ని మానసికంగా సమాయత్త పరిచే వారు. ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిగా పొందగలిగే వాతావరణాన్ని సృష్టించేవారు. సభలు, సమావేశాలు ఏర్పాటు చేసి రమజాన్ ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను ప్రజలకు బోధ పరిచేవారు.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) షాబాన్ మాసం చివరి తేదీన ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ప్రజలారా! ఒక మహత్తరమైన, శుభప్రదమైన పవిత్రమాసం (రమజాన్) తన ఛాయను మీపై కప్పబోతోంది. ఆ పవిత్రమాసంలోని ఒక రాత్రి వెయ్యి మాసాలకన్నా శ్రేష్ఠమైనది. ఆ మాసం ఉపవాసాలను అలా్లహ మీకు విధిగా చేశాడు.
అలాగే ఈ మాసంలో ఒక విధిని నెరవేరిస్తే ఇతర కాలంలో 70 విధులు నిర్వహించిన దానితో సమానంగా పుణ్యం లభిస్తుంది. ఎవరైనా ఈ మాసంలో (దైవ ప్రసన్నత, పుణ్యఫలాపేక్షలతో) ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే అతని పాపాలు క్షమించబడతాయి. నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. అతనికి ఉపవాసం ఉన్నవారితో సమానంగా పుణ్యం కూడా లభిస్తుంది. అలాగని ఉపవాసం పాటించే వ్యక్తి పుణ్యఫలంలో ఏ మాత్రం కొరత కలగదు’’ అని చెప్పారు. అప్పుడు ప్రజలు ‘‘దైవ ప్రవక్తా! మాలో ప్రతి ఒక్కరికీ ఇఫ్తార్ చేయించేటంత స్తోమత లేకపోతేనో?’’ అని ప్రశ్నించారు.
అప్పుడు ప్రవక్త మహానీయులు, ‘‘కొద్ది మజ్జిగతో లేక గుక్కెడు మంచినీటితో ఇఫ్తార్ చేయించినా దైవం అతనికి కూడా అదే పుణ్యం ప్రసాదిస్తాడు’’ అని చెబుతూ, తన ప్రసంగాన్ని కొన సాగించి, ఇలా అన్నారు. ‘‘ఎవరైనా ఒక రోజె దారుకు (ఉపవాసికి) కడుపు నిండా భోజనం పెడితే అతనికి అల్లాహ్ నా హౌజు (కౌసర్ కొలను) నుండి తనివి తీరా తాగిస్తాడు. తర్వాత ఇక అతనికి ఎప్పటికీ దాహం వేయదు. చివరికతను స్వర్గంలో ప్రవేశిస్తాడు’’ అని చెప్పాడు.
అంతేకాదు, ‘‘ఈ మాసంలోని మొదటి భాగం కారుణ్యం, మధ్యభాగం క్షమాపణ (మన్నింపు), చివరి భాగం నరకాగ్ని నుండి విముక్తి ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో తమ సేవకుల పనిభారాన్ని తగ్గిస్తారో, అల్లాహ్ వారిని క్షమిస్తాడు. వారికి నరకాగ్ని నుండి విముక్తి ప్రసాదిస్తాడు’’ (బైహఖీ-ఈమాన్ అధ్యయం) అని చెప్పారు.
ఇలా పవిత్ర రమజాన్‌కు సంబంధించి కారుణ్యమూర్తి ముహమ్మద్(స) మనకు బోధించిన అమృత వచనాలు. అందుకని ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిస్థాయిలో పొందడానికి ప్రతి ఒక్కరు శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దైవంతో సంబంధం పటిష్ట పరచుకోవాలి. ఆర్థిక స్తోమతను బట్టి వీలైనంత ఎక్కువగా దానధర్మాలు చేస్తుండాలి. సమాజంలోని అభాగ్యులను ఏమాత్రం విస్మరించకూడదు.
- ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్