మళ్లీ ము‘క్యాష్’ కింగ్..!
ముంబై: భారత్‌లో అత్యంత సంపన్నునిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ కొనసాగుతున్నారు. ఆయన సంపద రూ.3,80,700 కోట్లు. తాజా ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురున్ ఇండియా 2019 రిచ్ లిస్ట్ ఈ విషయాన్ని తెలియజేసింది. ఈ జాబితాలో వరుసగా ఎనిమిదేళ్ల నుంచీ ఆయనదే అగ్రస్థానం. ఇక ఈ జాబితాలో రెండవ స్థానంలో లండన్ కేంద్రంగా ఉంటున్న ఎస్పీ హిందూజా అండ్ ఫ్యామిలీ నిలిచింది. వీరి సంపద రూ.1,86,500 కోట్లు. రూ.1,17,100 కోట్ల విలువతో విప్రో వ్యవస్థాపకుడు అజీమ్ ప్రేమ్‌జీ మూడవ స్థానంలో ఉన్నారు. తాజా ఆవిష్కృత జాబితాలో ముఖ్యాంశాలు చూస్తే...
► రూ.1,000 కోట్లు పైబడిన సంపద ఉన్న భారతీయుల సంఖ్య 2019లో 953కు పెరిగింది. 2018లో ఈ సంఖ్య 831 మాత్రమే.
► అమెరికా డాలర్ల రూపంలో చూస్తే, బిలియనీర్ల సంఖ్య 141 నుంచి 138కి పడింది. డాలరుతో రూపాయి విలువ లెక్కన రూ.7,000 కోట్ల సంపద పైబడిన వారిని బిలియనీర్లుగా పరిగణిస్తారు.
► రూ.1,000 కోట్లు పైబడిన మొత్తం 953 మందిని తీసుకుంటే, వీరిలో మొదటి 25 మంది మొత్తం సంపద స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 10 శాతం. మొత్తం అందరినీ పరిగణనలోకి తీసుకుంటే మాత్రం జీడీపీలో ఈ విలువ 27 శాతం.
► సంపన్నుల సంపద 2018తో పోల్చితే 2% పెరిగింది. 344 మంది వ్యక్తుల సంపద తగ్గింది.
► మొత్తం సంపన్నుల్లో 246 మందితో (జాబితాలో 26%) ముంబై టాప్‌లో ఉంది. 2, 3 స్థానాల్లో న్యూఢిల్లీ(175), బెంగళూరు(77) ఉన్నాయి.
► సంపన్నులకు సంబంధించి 82 మంది ప్రవాస భారతీయులను తీసుకుంటే, వారిలో 76 మంది స్వశక్తితో పైకి వచ్చినవారు ఉన్నారు. ఎన్ఆర్ఐలకు ఈ విషయంలో అత్యంత ప్రాధాన్యతా దేశంగా అమెరికా ఉంది. యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్, బ్రిటన్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
► స్వశక్తితో సంపన్నులైన వారిలో అత్యంత యువకుడు రితేష్ అగర్వాల్ (25). ఓయో అధిపతి∙అగర్వాల్ సంపద రూ.7,500 కోట్లు.
► జాబితాలో 152 మంది మహిళలు కూడా ఉన్నారు. వీరి సగటు వయసు 56 సంవత్సరాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ రోష్నీ నాడార్ (37) మొదటి స్థానంలో నిలిచారు. భారత్‌లో స్వయం శక్తిగా సంపన్నురాలిగా ఎదిగిన మహిళల జాబితాలో బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా ఉన్నారు. ఆమె సంపద రూ.18,500 కోట్లు.
వృద్ధిలో వీరి పాత్ర కీలకం...
ప్రపంచ వృద్ధిలో సంపద సృష్టికర్తలు కీలకపాత్ర పోషిస్తున్నారు. భారత్ ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి కేంద్రం వృద్ధి వ్యూహాలు రూపొందిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఐదేళ్లలో భారత్ సంపన్నుల జాబితా మూడింతలు పెరుగుతుందని భావిస్తున్నాం.
–అనాన్ రెహ్మాన్ జునైడ్, హురున్ రిపోర్ట్ ఇండియా ఎండీ, చీఫ్ రెసెర్చర్
వేగం పుంజుకుంటున్న భారత్
భారత్ వృద్ధి వేగం పుంజుకుంటోంది. దీనికి యువ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల మద్దతు ఎంతో ఉంది. దేశంలో సంపద నిర్వహణ సామర్థ్యం ఎంతో మెరుగుపడుతోంది.
– యతిన్ షా, ఐఐఎఫ్ఎల్ వెల్త్ మేనేజ్మెంట్ కో–ఫౌండర్
తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు బిలియనీర్లు
హురున్ భారతీయ కుబేరుల జాబితా (బిలియనీర్లు)లో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు చోటు దక్కించుకున్నారు. అరబిందో ఫార్మా చైర్మన్ పీవీ రాంప్రసాద్ రెడ్డి రూ.14,800 కోట్ల సంపదతో దేశంలోని 100 మంది కుబేరుల్లో 51వ స్థానంలో నిలిచారు. మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్(ఎంఈఐఎల్) చైర్మన్ పి.పిచ్చిరెడ్డి 57వ స్థానంలో, ఎంఈఐఎల్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి 63వ ర్యాంకును చేజిక్కించుకున్నారు. జాబితాలో దివి సత్చంద్ర కిరణ్ 83వ స్థానం, నీలిమ మోటపర్తి 89వ స్థానాన్ని దక్కించుకున్నారు.
పి.పిచ్చిరెడ్డి, పీవీ కృష్ణారెడ్డి
కాగా, దేశంలోని టాప్–10 మహిళా కుబేరుల జాబితాలో దివీస్ ల్యాబ్స్‌కు చెందిన నీలిమ 8వ ర్యాంకులో నిలిచారు. ఇక స్వశక్తితో వ్యాపారవేత్తలుగా ఎదిగిన అత్యంత పిన్న వయస్కుల్లో(40 ఏళ్ల లోపు) విజయవాడకు చెందిన 33 ఏళ్ల శ్రీహర్ష మాజేటి చోటు సంపాదించారు. స్విగ్గీ సహ ప్రమోటర్ శ్రీహర్ష సంపద విలువను హురున్ రూ.1,400 కోట్లుగా లెక్కగట్టింది. మొత్తం సంపన్నుల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు 68 మంది,(గతేడాది 49), ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 9 మంది(గతేడాది 6) ఉన్నట్లు హురున్ వెల్లడించింది.
గోపిచంద్ హిందూజా, శ్రీచంద్ హిందూజా, అజీం ప్రేమ్‌జీ
రాంప్రసాద్‌రెడ్డి, దివి సత్చంద్ర కిరణ్, నీలిమ, శ్రీహర్ష మాజేటి