ఫ్రెండ్ రిక్వెస్ట్‌తో బుక్కయ్యాడు..
వాషింగ్టన్: దొంగతనం చేస్తే ఎవరైనా ఏం చేస్తారు.. కొద్దిరోజులు సెలైంట్‌గా ఉంటారు. తాను దొంగతనం చేసిన వ్యక్తికి.. ఆ ప్రాంతానికీ దూరంగా ఉంటారు. కానీ అమెరికాలో ఓ దొంగ అత్యుత్సాహం అతడిని కటకటాల పాలు చేసింది. దొంగతనం చేసిన తర్వాత సెలైంట్‌గా ఉండటం మానేసి.. దొంగతనం చేసిన వ్యక్తికే ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టి అడ్డంగా బుక్కైపోయాడు. నమ్మశక్యం కానీ ఈ ఘటన అమెరికాలో జరిగింది. ఓ బస్ టెర్మినల్‌లో ఓ యువతి వేచిచూస్తూ ఉండగా.. అక్కడికి రిలై ముల్లిన్స్ (28) అనే దొంగ ముసుగు వేసుకుని వచ్చాడు. యువతిని బెదిరించి పర్సు, ఐపాడ్ లాక్కుని పరారయ్యాడు.
అయితే ఆ సమయంలో బాధితురాలు దొంగ ముఖాన్ని చూడలేకపోయినా.. అతని చేతిపై త్రికోణాకృతిలో ఉన్న పచ్చబొట్టును గుర్తించింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఆ యువతికి ఫేస్బుక్లో ఓ ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. తీరా చూస్తే ఆ రిక్వెస్ట్ వచ్చింది దొంగ ముల్లిన్స్ నుంచి. దొంగ చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఆ యువతి అతడిని గుర్తుపట్టేసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముల్లిన్స్ కటకటాల పాలయ్యాడు.