రైతు సమితుల పేరుతో రాజకీయం
మల్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతు సమన్వయ సమితుల పేరుతో ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని, రాజకీయ లబ్ధి కోసం రైతులను పావులుగా వాడుకుంటోందని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి విమర్శించారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ, ప్రభుత్వం జీవో 39 ద్వారా రైతుల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తోందన్నారు. చట్టానికి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న ఈ జీవోపై ఇప్పటికే రైతులు కొందరు కోర్టులకు వెళ్లారని, ఏ కారణం చేతనైనా కోర్టులు ఆ ఉత్తర్వులను రద్దు చేస్తే దానికి రాజకీయాలు పులిమి.. కాంగ్రెస్‌పై విమర్శలు చేయవచ్చని టీఆర్ఎస్ చూస్తోందన్నారు. కాగా, ప్రముఖ జర్నలిస్ట్ గౌరీ లంకేష్ హత్యపై పీసీసీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మీడియా ప్రతినిధులపై దాడులు సరికాదని, గౌరీ హత్య ప్రజా గొంతులను అణచివేసే కుట్ర అని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్లు రవి డిమాండ్ చేశారు.