సింహంపై ఊరేగిన పెళ్లికొడుకు!!
ముల్తాన్: అదో విలాసవంతమైన పెళ్లి. సింహంపై ఊరేగుతూ పెళ్లికొడుకు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. నమ్మకలేక పోతున్నారా? అయితే పాకిస్తాన్ లోని ముల్తాన్ లో జరిగిన పెళ్లి గురించి తెలుసుకోవాల్సిందే. కోటీశ్వరుడు కొడుకైన షేక్ మహ్మద్ కు కనీవినీ ఎరుగనిరీతిలో పెళ్లి చేసుకోవాలకున్నాడు. మహ్మద్ కోరిక మేరకు అతడి తండ్రి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశాడు.
సింహంపై ఎక్కి పెళ్లి మండపానికి రావాలన్న కోరికను వరుడు వ్యక్తం చేయడంతో అందరూ అవాక్కయ్యారు. మహ్మద్ తండ్రి మాత్రం కొడుకు కోరికను తీర్చేందుకు సిద్ధపడ్డాడు. బోనులో బంధించిన సింహాన్ని తెప్పించాడు. బోనుతో సహా సింహాన్ని జీపు ఎక్కించారు. సింహం ఉన్న బోనుపై కూర్చుని ఊరేగుతూ వరుడు పెళ్లి మండపానికి చేరుకున్నాడు. వందలాది మంది లారీల్లో, వీధుల్లో డాన్సులు చేస్తూ వరుడి వెంట ఊరేగింపుగా వెళ్లారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లారు.
వరుడికి వధువు కుటుంబం రూ. 5 కోట్లు కట్నం ఇచ్చింది. అంతేకాదు పెళ్లికొడుక్కి హోండా కారు, అతడి సోదరులకు మోటారు సైకిళ్లతో పాటు రకరకాల వస్తువులు కానుకలుగా సమర్పించుకుంది. వీటన్నింటినీ పెళ్లి మండపంలో ప్రదర్శించడం విశేషం. ఈ పెళ్లికి 15 వేల మందిపైగా హాజరయినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియోను '24 న్యూస్' అధికారిక యూట్యూబ్ చానల్ లో పెట్టింది.