ప్రమోషన్లలో సీనియారిటీ లొల్లి
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల పదోన్నతు ల వ్యవహారం గందరగోళంగా మారుతోంది. స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ) నుంచి ప్రధానోపాధ్యాయుడు (హెచ్ఎం)గా పదోన్నతి కల్పించే విషయంలో సీనియారిటీ తారుమారవుతోందని కొందరు టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ విధానంలో సీనియారిటీ రూపకల్పనలో తప్పులు దొర్లుతున్నాయని, దీనివల్ల కొందరు టీచర్లకు పదోన్నతుల్లో అన్యాయం జరిగే వీలుందని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన ప్రక్రియను ఈ నెల 3 నుంచి మొదలుపెట్టింది. ఈ ఏడాది జనవరిలో బదిలీల కోసం 78 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 1న కాకుండా, సెప్టెంబర్ 1కి కటాఫ్ పెంచడంతో మంగళవారం వరకూ మరో 7 వేల మంది దర ఖాస్తు చేసుకున్నారు. కాగా, పదోన్నతుల ప్రక్రియను ఎంఈవోలు, డీఈవోల పరిధిలో నిర్వహిస్తూ, వాళ్లే సీనియారిటీని రూపొందిస్తున్నారు.
జోనల్ సిస్టమ్‌తో సమస్యలు...
2022లో జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయులు మల్టీజోనల్ పరిధిలోకి వస్తారు. రెండు జోన్లుగా విభజించి, ఉమ్మడి నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మెదక్‌తోపాటు కామారెడ్డి, సిద్దిపేటను మల్టిజోన్–1లో చేర్చారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలతోపాటు సంగారెడ్డిని మల్టీజోన్–2 పరిధిలోకి తెచ్చారు. జోనల్ వ్యవస్థ లేనప్పుడు జిల్లా సీనియారిటీ ప్రాతిపదికగానే పదో న్నతులు కల్పించారు.
అక్కడి పోస్టులు, ఖాళీల కు అనుగుణంగా ప్రమోషన్లు ఇచ్చారు. ఈ కారణంగా కొన్ని జిల్లాల్లో ఎక్కువ సర్విసు ఉన్న వారికి పదోన్నతులు రాలేదు. కొన్ని జిల్లాల్లో తక్కువ సర్విస్ ఉన్నా హెచ్ఎంలుగా ప్రమోష న్లు వచ్చాయి. ఇప్పుడు మల్టిజోన్ వారీగా సీనియారిటీని నమోదు చేయాలంటే 19 జిల్లాల పరిధిలోని టీచర్ల ను మల్టిజోన్–1లో కి తేవాలి. 14 జిల్లా ల పరిధిలోని టీచర్లను మల్టిజోన్–2 పరిధిలోకి తేవాలి.
ఇక్కడే సమస్య తలెత్తుతోందని, ఈ సమస్యలు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయని టీచర్లు అంటున్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఎక్సెల్ ఫార్మాట్లో సీనియారిటీ జాబితాలో పొరపాట్లు దొర్లుతున్నాయని టీచర్లు డీఈవోలకు ఫిర్యాదులు చేస్తున్నారు. మల్టిజోన్ల పరిధిలో మాదిరి సీనియారిటీ జాబితాలను విడుదల చేయడంతో ఈ గందరగోళం నెలకొన్నట్టు చెబుతున్నారు.
ఏడాది ఉన్నా వెళ్లాల్సిందేనా?
రాష్ట్రవ్యాప్తంగా రెండు మల్టిజోన్ల పరిధిలో 1,974 హెచ్ఎం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. సీనియారిటీని కొలమానంగా తీసుకుంటే దాదాపు వెయ్యి మందికిపైగా టీచర్లు మూడేళ్ల సర్వీస్‌లోపు ఉన్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్ల సీనియారిటీ ఉంటే బదిలీకి అవకాశం ఉండదు. కానీ ప్రమోషన్‌కు ఈ నిబంధన వర్తించదు. ప్రమోషన్ వచ్చాక మల్టిజోనల్ పరిధిలో ఉండే జిల్లాలోని పోస్టు ఎంత దూరం ఉన్నా వెళ్లాల్సిందే.
ఈ కారణంగా సర్విస్ తక్కువగా ఉన్న దాదాపు 800 మంది వరకూ పదోన్నతిని తిరస్కరించే వీలుంది. ప్రమోషన్, బదిలీ ఆర్డర్ వచ్చిన తర్వాత పదోన్నతిని తిరస్కరించే వీలుంది. అప్పుడు పాత చోటే పోస్టు ఇస్తారా? అనే సందేహాలు కలుగుతున్నాయని టీచర్లు అంటున్నారు. రిటైర్మెంట్ వయసులో హెచ్ఎం ప్రమోషన్ కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి చాలా మంది ఇష్టపడటం లేదు. ఈ కారణంగా 1,974 పోస్టులు పూర్తిస్థాయిలో ప్రమోషన్లతో భర్తీ చేయడం కష్టమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.