Mulugu Government Hospital
-
‘రాష్ట్రం జ్వరాలమయంగా మారింది’
సాక్షి, ములుగు: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు విషజ్వరాల బారిన పడి ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. మంగళవారం ఆయన ములుగు జిల్లా కేంద్రంలోని ఏరియా ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ములుగు ఏరియా ఆస్పత్రిని జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ప్రభుత్వం ప్రకటించిందని కానీ, అందుకు తగిన విధంగా సౌకర్యాలు కల్పించలేదని భట్టి విక్రమార్క మండిపడ్డారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి అంటే 250 పడకలు ఉండాలి. అయితే ఇక్కడ కేవలం వంద పడకలు మాత్రమే ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాక మందులు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మాత్రం ములుగు ఆస్పత్రి 50 పడకల ఆస్పత్రి మాత్రమే అని, ఆ మేరకే మందులు సరఫరా చేస్తున్నారని ఈ సందర్బంగా సీఎల్పీ నేత భట్టి మీడియాకు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖకు, డ్రగ్ కంట్రోల్ శాఖకు మధ్య సమన్వయం లేదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు.రాష్ట్రం జ్వరాలమయంగా మారిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో పరిపాలన లేదు అని చెప్పడానికి ఇంతకంటే మించి ఇంకేమి కావాలి అన్నారు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టించిన ఈ ఆస్పత్రికి రాష్ట్రం ఏర్పాటు తరువాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన వెంట స్థానిక ఎమ్మెల్యే సీతక్క, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. వసతులు ఎక్కడ? అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముందుచూపుతో ఇక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఏర్పాటు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరేళ్లలో ఇప్పటివరకు కూడా కనీసం ఎక్విప్మెంట్లు సమకూర్చలేదని ఎద్దేవా చేశారు. ఎంఆర్ఐ, ఈసీజీలతో పాటు బ్లడ్ సేపరేటర్, డయాలసిస్ సెంటర్ సౌకర్యం కూడా లేదని మండిపడ్డారు. డాక్టర్లు ఎక్కడ? ములుగు ప్రభుత్వ ఆసుపత్రిలో పదిమంది సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా ఒక్కరు కూడా లేరని ప్రశ్నించారు. అలాగే ఏడుగురు డిప్యూటీ సివిల్ సర్జన్లు ఉండాల్సి ఉండగా.. ఒకరు కూడా లేరన్నారు. అంతేకాక సివిల్ అసిస్టెంట్ సర్జన్లు 27 మంది ఉండాల్సి ఉండగా.. 11 పోస్టులు ఖాళీ ఉన్నాయని ఈ సందర్బంగా భట్టీ పేర్కొన్నారు. నర్సింగ్ విభాగానికి వస్తే.. గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులు రెండు ఉండగా.. రెండూ ఖాళీగానే ఉన్నట్లు తెలిపారు. స్టాఫ్ నర్సు పోస్టులు 25 ఉండగా, అందులో 20 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు భట్టి మీడియాకు వివరించారు. -
కలెక్టర్ గారి మనవరాలు ప్రభుత్వాసుపత్రిలో పుట్టింది!
ఆదర్శంగా నిలిచిన భూపాలపల్లి కలెక్టర్ మురళి విషమ పరిస్థితుల్లోనూ సడలని నమ్మకం సిజేరియన్ చేసిన వైద్యులు.. తల్లీబిడ్డలు క్షేమం ఒకవైపు ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి. ఎంత ఖర్చయినా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లేందుకే మొగ్గు చూపుతున్న వైనం..మరోవైపు హైదరాబాద్‌లో నివసిస్తున్న తన కూతురికి నెలలు నిండాయి. ఆమెకు థైరాయిడ్ సమస్య. పెద్దపెద్ద కార్పొరేట్ ఆస్పత్రుల్లో డెలివరీ చేయించొచ్చు. కాని.. ప్రసవానికి ములుగు ప్రభుత్వ ఆస్పత్రినే ఎంచుకున్నారు. ప్రసవం క్రిటికల్ కావచ్చని వైద్యులు హెచ్చరించినా వెనకడుగు వేయలేదు. ఇప్పుడు మనవరాలిని చూస్తూ మురిసిపోతున్నారాయన!...ప్రభుత్వ ఆస్పత్రులపై విశ్వాసం పెంచేందుకు భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి చేసిన ప్రయత్నమిది. సాక్షి, భూపాలపల్లి: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం నింపేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ ఆకునూరి మురళి ముందుడుగు వేశారు. హైదరాబాద్‌లో ఆధునిక వైద్యం, కార్పొరేట్ ఆస్పత్రులున్నా.. ఏజెన్సీ ప్రాంత ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో తన కూతురికి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం చేయించాలని మురళి నిర్ణయించారు. నిర్ణయించినట్టుగా తన కుమార్తె ప్రగతిని ప్రసవం కోసం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. శుక్రవారం ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మురళి కూతురు ప్రగతి, అల్లుడు ప్రదీప్ హైదరాబాద్ లో స్థిరపడ్డారు. మురళి నిర్ణయం నేపథ్యంలో ప్రగతి ప్రసవం కోసం తండ్రి ఉంటున్న భూపాలపల్లికి వచ్చింది. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా శుక్రవారం ఉదయం పది గంటలకు చిట్యాల ప్రభుత్వ ఆస్పత్రి వైద్యురాలు స్నిగ్ధ వచ్చి పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో నొప్పులు ప్రారంభం కావడంతో వెంటనే వైద్య సహాయం అందివ్వాలని సూచించారు. దీంతో ప్రగతిని హుటాహుటిన ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తల్లి కడుపులో ఉమ్మ నీరు తక్కువగా ఉన్నట్లు గమ నించిన వైద్యులు వెంటనే సిజేరియన్ చేయా లని నిర్ణయించారు. డీఎంహెచ్‌వో అప్పయ్య, ఆస్పత్రి సూపరింటెండ్ గోపాల్ పర్యవేక్షణలో వైద్యులు ఆపరేషన్ నిర్వహించారు. సాయం త్రం 3:30 గంటలకు ప్రగతి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రమాదం అని తెలిసినా... కలెక్టర్ మురళి కూతురు ప్రగతికి థైరాయిడ్ సమస్య ఉంది. ప్రసవం క్రిటికల్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కార్పొరేట్ ఆస్ప త్రులకు వెళ్లే అవకాశం ఉన్నా ప్రభుత్వ ఆస్ప త్రులు, అక్కడి సిబ్బందిపైనే కలెక్టర్ నమ్మకం ఉంచారు. భూపాలపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఒక్కటే ఉంది. వంద పడకల ఆస్పత్రి నిర్మాణంలో ఉంది. ఉమ్మ నీరు తక్కువ ఉండటంతో వెంటనే ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. భూపాలపల్లి నుంచి హన్మకొండకు 70 కిలోమీటర్లు.. ములుగు 45 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో ములుగు వెళ్లేందుకే మురళి మొగ్గు చూపారు. సాధ్యమైనంత వరకు నార్మల్ డెలివరీ అయ్యేలా చూడాలని వైద్యులకు సూచించినట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉండటం వైద్యులు సిజేరియన్ చేశారు. ప్రసవం కోసం కూతురుని ములుగు పంపిన కలెక్టర్.. అనంతరం ఇసుక క్వారీలపై జిల్లా స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాతే ఆస్పత్రికి వెళ్లి కూతురు, మనవరాలిని చూసుకున్నారు. ‘ప్రగతి’ బాటలో ప్రభుత్వాసుపత్రులు ‘కార్పొరేట్ ఆస్పత్రులకు తీసిపోని వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో లభిస్తున్నాయి. సర్కారు దవాఖానాలపై విశ్వాసం ఉంచాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలపై ప్రజల్లో నమ్మకం కలిగించేందుకే నా కుమార్తె ప్రసవానికి గ్రామీణ ప్రాంతమైన ములుగును ఎంచుకున్నా. ’ అని తెలిపారు కలెక్టర్ మురళి.