ములుగు ఎన్కౌంటర్.. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండించిన డీజీపీ
సాక్షి, హైదరాబాద్: ములుగు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో పౌరహక్కుల సంఘం ఆరోపణలను తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి ఖండించారు. ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది తప్పుడు ప్రచారం అంటూ కొట్టిపారేశారు.ములుగు జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి స్పందించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. ‘ఎదురుకాల్పుల్లో విష ప్రయోగం చేశారనేది దుష్ప్రచారం. పౌరహక్కుల సంఘం ఆరోపణలను ఖండిస్తున్నాను. ఎదురుకాల్పులకు కొద్ది రోజుల ముందు ఇన్ఫార్మర్ అనే నెపంతో ఇద్దరు ఆదివాసీలను దారుణంగా హత్య చేశారు. ఇలాంటి ఘటనలను అడ్డుకొనేందుకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులపై మావోయిస్టులు కాల్పులకు దిగారు.మావోయిస్టులు అత్యాధునిక ఆయుధాలు వినియోగించారు. పోలీసులతో జరిగిన ఎదురు కాల్పుల్లో సాయుధులైన ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. శవపరీక్షలు.. హైకోర్టు, ఎన్హెచ్ఆర్సీ సూచనల మేరకే జరుగుతున్నాయి. విచారణ అధికారిగా ఇతర జిల్లా డిఎస్పీని నియమించాము. దర్యాప్తు కొనసాగుతోంది అని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఆదివారం తెల్లవారుజామున ములుగు జిల్లా ఏటూరునాగారంలో ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఓ మహిళా మావో సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నర్సంపేట-ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి కుర్సం మంగు అలియాస్ భద్రు, ఏటూరునాగారం-మహాదేవ్‌పూర్ డివిజన్ కమిటీ కార్యదర్శి ఈగోలపు మల్లయ్య అలియాస్ మధు సైతం ఉన్నారు. మధు స్వస్థలం పెద్దపల్లి జిల్లా రాణాపూర్ కాగా, మిగతా ఆరుగురు ఛత్తీస్‌గఢ్ జిల్లాకు చెందినవారు. ఉదయం 6.16 గంటల ప్రాంతంలో చెల్పాక-ఐలాపూర్ అభయారణ్యంలోని పోలకమ్మవాగు సమీపంలో మావోయిస్టులకు, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. దాదాపు అరగంటకుపైగా కాల్పులు జరిగినట్లుగా పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలంలో ఏడుగురి మృతదేహాలను గుర్తించారు. ఘటనాస్థలిలో రెండు ఏకే-47 తుపాకులు, 303 రైఫిల్, ఇన్సాస్ తుపాకీ, ఎస్బీబీఎల్ గన్, సింగిల్‌షాట్ తుపాకీ, తపంచా, కిట్‌బ్యాగులు, విప్లవ సాహిత్యం తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.