థ్యాంక్యూ ఇండియా: ఫ్రెంచ్ కుటుంబం లేఖ
సాక్షి, ముంబై: థ్యాంక్యూ ఇండియా.. ఇది ఓ ఫ్రెంచ్ కుటుంబం చెప్పిన మాట. వరదల్లో చిక్కుకుని సురక్షితంగా ఇంటికి చేరిన ఆకుటుంబం ఓ ఉత్తరం రాసింది. వివరాల్లోకి వెళ్లే బోలెస్వాస్కి అనే వ్యక్తి కుటుంబంతో సహా భారత పర్యటనకు వచ్చి ముంబై వరదల్లో చిక్కుకుపోయారు. దాదార్లోని మూడు హోటల్స్కు వెళ్లారు. అయితే ఎక్కడా వారికి రూం, వసతి దొరకలేదు. అయితే చీకటిలో చిరుదివ్వెలాగా వారికి గురుద్వారా ఆశ్రయం కల్పించింది.
గురుద్వారా నిర్వాహకులు వారిని సాదరంగా లోనికి ఆహ్వానించారు. ఆకలితో ఉన్న బోలెస్వాస్వి కుటుంబానికి దాల్ కిచిడీ పెట్టి కడుపు నింపింపారు. విదేశీయులు కావడంతో నిర్వాహకులు వారి భద్రత దృష్ట్యా ఓ చిన్న గదిని కుడా ఇచ్చారు. మరుసటి రోజు తమ దేశానికి వెళ్లిన బొలెస్వాస్కి కుటుంబం పొందిన సహాయాన్ని మర్చిపోలేదు. గురుద్వారా నిర్వాహకులు అందించిన సహాయాన్ని గుర్తు చేసుకుంటూ ఓఉత్తరం రాశారు. ముంబై వరదలు తమకు చేదు అనుభవంకాగా, గురుద్వారాలో తమను ఆదరించిన తీరు ఓ తీయని జ్ఞాపకంగా తమ జీవితంలో నిలిచిపోయిందని పేర్కొన్నారు. తమకు చేసిన సహాయానికి కృతజ్ఞతగా తమలాంటి మరికొంత మందిని ఆదుకోవాలంటూ ఆర్థిక సహాయం అందించారు.
ఈసందర్బంగా గురుద్వారా నిర్వాహకులు, ఉపాధ్యక్షుడు కుల్వంత్ సింగ్ మాట్లాడుతూ బోలెస్వాస్కి కుటుంబానికి ప్రత్యేక సదుపాయలు అందిచ్చినా వారు అన్నింటిని తిరస్కరించి నేలపైనే పడుకొన్నారని తెలిపారు. వరదల్లో నిరాశ్రయులైన 750మందిపైగా ప్రజలకు ఆశ్రయం కల్పించామని, ఆహారం అందిచామన్నారు. ఈ కష్టకాలంలో వారు మా అతిథులు, వారిని అన్ని విధాలుగా అండగా ఉంటామని కుల్వంత్ సింగ్ తెలిపారు.