హజీ అలీ దర్గాలో తృప్తి దేశాయ్ ప్రార్థనలు
న్యూఢిల్లీ : భూమాత బ్రిగేడ్ వ్యవస్థాపకురాలు తృప్తి దేశాయ్ ఎట్టకేలకు ముంబైలోని హజీ అలీ దర్గాలో ప్రవేశించారు. పోలీసులు భద్రత మధ్య ఆమె గురువారం ఉదయం దర్గాలో ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం తృప్తి దేశాయ్ మాట్లాడుతూ... స్త్రీ, పురుషుల మధ్య సమానత్వం సాధించేందుకే తమ పోరాటం అన్నారు. మరొకసారి గర్భగుడికి వెళ్లి ప్రార్థనలు చేసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పోలీసులు ఈసారి తమకు సహకరించారని తృప్తి పేర్కొన్నారు.
హజీ అలీ దర్గాలోకి ఏప్రిల్ 28న తృప్తి దేశాయ్తో పాటు పలువురు మహిళలు లోనికి ప్రవేశించేందుకు యత్నించగా, పోలీసులతో పాటు స్థానిక ముస్లింలు అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి ఆమె దర్గాలోకి ప్రవేశించగలిగినా... దర్గాలోని ముఖ్యప్రాంతం (గర్భగుడి)లోకి మాత్రం వెళ్లలేకపోయారు. కాగా ఆలయాల్లో మహిళలకు సమాన హక్కుల కోసం తృప్తి దేశాయ్ గత కొన్ని నెలలుగా పోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్, త్రయంబకేశ్వర్ ఆలయాల ప్రవేశం అనంతరం హజీ అలీ దర్గా ప్రవేశం చేశారు.