ముంబయి వీధిలో కుక్కను వేటాడిన చిరుత
సాక్షి, ముంబయి : నడి వీధిలో ఓ కుక్కను చిరుత వేటాడింది. నిద్రపోతున్న కుక్క చిరుత గాండ్రింపునకు బెదిరి పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్క దెబ్బతో పడగొట్టింది. రోడ్డు మధ్యలోకి ఈడ్చుకెళ్లి కొద్ది సేపు కిందపడేసి చుట్టూ చూసి ఎత్తుకొని వెళ్లింది. ఈ భయానక సంఘటన సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. అందులో నమోదైన ప్రకారం ఈ సంఘటన ఈ నెల(సెప్టెంబర్) 5న తెల్లవారు జామున 4.04గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది.
ముంబయిలో టేక్ వుడ్ కూపరేటివ్ హౌసింగ్ సొసైటీ ఉంది. అక్కడకు సమీపంలోనే సంజయ్‌గాంధీ నేషనల్ పార్క్ ఉంటుంది. ఈ హౌసింగ్ సొసైటీలోకి అప్పుడప్పుడు అటవీ జంతువులు సాధారణంగా వస్తుంటాయి. అయితే, అది అర్ధరాత్రి సమయంలో మనుషుల అలికిడి లేని సందర్భాల్లో. వాటిని చూసి కూడా అక్కడి వారు పెద్దగా భయపడకుండా ఉంటారట. ఎందుకంటే అవి ఎప్పుడు వచ్చిన తచ్చాడి వెంటనే వెళ్లిపోతుంటాయని వారు చెబుతుంటారు.
కానీ, ఒక కుక్కపై అంత భయంకరంగా దాడి చేయడం ఇదే తొలిసారి, ఆ దృశ్యం చూశాక మాత్రం తమకు భయం మొదలైందని ఇప్పుడు ఆ కాలనీ వాసులు చెబుతున్నారు. దీనిపై అటవీ శాఖ అధికారులు స్పందిస్తూ ఇక నుంచి సెక్యూరిటీ సిబ్బందితో కాలనీలో ప్రతి రోజు గస్తీకి తిప్పుతామని, ఎవరికీ చిరుత ఇతర ప్రాణి కనిపించినా తమకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని చెప్పారు. ఎవరూ భయపడొద్దని అందరికి తాము అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.