ఎమ్మెన్నెస్ అభ్యర్థిగా సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్!
మరో బాలీవుడ్ కు చెందిన మరో ప్రముఖుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. రాజ్ థాక్రే నాయకత్వంలోని మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన(ఎమ్మెన్నెస్) పార్టీ తరపున సినీ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ ఎన్నికల బరిలోకి దిగనుండటంతో వాయవ్య ముంబైలో పోరు మరింత ఆసక్తిగా మారనుంది. ఇప్పటికే వాయవ్వ ముంబై లోకసభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున గురుదాస్ కామత్, శివసేన నుంచి గజానన్ కీర్తికర్, ఆమ్ ఆద్మీ పార్టీ తరపున మయాంక్ గాంధీ బరిలో ఉన్నారు.
ఈ స్థానం నుంచి మహేశ్ మంజ్రేకర్ బరిలోకి దిగడంతో శివసేన అభ్యర్థి కీర్తికర్ గెలుపు అవకాశాలు సన్నగిల్లడమే కాకుండా ఎన్సీపీ, కాంగ్రెస్ అభ్యర్థి విజయానికి దోహదం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గురుదాస్ కామత్ వాయవ్య ముంబై స్థానం నుంచి 38 వేల ఓట్లతో విజయం సాధించారు.
కాని ఈసారి బహుముఖ పోటీ నెలకొనడం, ఆమ్ ఆద్మీ పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలువడం ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారనే విషయాన్ని చెప్పవడం కష్టంగా మారింది. 16 లక్షల మంది ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో అత్యధిక సంఖ్యలో ఉన్న మరాఠీ, గుజరాతీ ఓటర్లే కీలకంగా మారనున్నారు. జుహు, విలే పార్లే వెస్ట్ తోపాటు, టెలివిజన్ రంగానికి చెందిన ఎక్కువ మంది ప్రముఖులతోపాటు, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఇదే నియోజకవర్గంలో ఉన్నారు. వాస్తవ్, అస్థిత్వ, పితా చిత్రాలకు దర్శకత్వం వహించగా, నటుడిగా పలు తెలుగు, హిందీ చిత్రాల్లో మహేశ్ కనిపించారు.