ముంబై అత్యాచారం: గజానికో గాంధారీ పుత్రుడు
'యత్ర నార్యస్తు పూజ్యంతే.. రమంతే తత్ర దేవతా' అని ఆర్యోక్తి. మహిళలను పూజించేచోటే దేవతలు నివాసం ఉంటారన్నది దాని అర్థం. ఇదే ఆర్యోక్తిని చెప్పిన మన దేశంలో పురాణకాలం నుంచి మాత్రం మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. దాదాపు ఏడాది క్రితం దేశ రాజధానిలో కదులుతున్న బస్సులో 'నిర్భయ'పై సామూహిక అత్యాచారం చేసి, ఆమె స్నేహితుడిని కుళ్లబొడిచి.. ఆమె మరణానికి కారణమయ్యారు ఆరుగురు మృగాళ్లు. ఈ సంఘటనపై దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయి. తత్ఫలితంగా అత్యాచారానికి పాల్పడి.. ఆ నేరం మరింత తీవ్రమైనదైతే ఉరిశిక్ష వరకు విధించేలా 'నిర్భయ' చట్టాన్ని సైతం రూపొందించారు. ఈ కేసులో కీలక నిందితుడు రామ్ సింగ్ అనుమానాస్పద పరిస్థితుల్లో జైల్లోనే మరణించగా, మరో ఐదుగురికి ఇంకా శిక్ష ఖరారు కూడా కాలేదు.
ఈ మధ్య కాలంలో కూడా ఎన్నో అత్యాచార సంఘటనలు వెలుగుచూశాయి. ఇప్పుడు తాజాగా మళ్లీ ముంబైలో ఓ పత్రికా ఫొటోగ్రాఫర్‌పై ఐదుగురు మగాళ్లు తమ ప్రతాపం చూపించారు. విధి నిర్వహణలో భాగంగా ఆమె 'శక్తి మిల్స్' అనే ప్రాంతంలో కొనసాగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, డ్రగ్స్ సేవనం లాంటి వ్యవహారాలను ఫొటో తీయడానికి ప్రాణాలకు సైతం తెగించి వెళ్లింది. కానీ అక్కడ ఆమె మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. అప్పటికే డ్రగ్స్ మత్తులో కొట్టుకుంటున్న ఐదుగురు మగాళ్లు అచ్చం ఢిల్లీ నిర్భయ కేసులో లాగే... ఆమెతో పాటు ఉన్న అసిస్టెంట్‌ను తాళ్లతో్ కట్టేసి, కొట్టి.. మరీ ఆమెను చెరిచారు.
భారతదేశం పర్యాటకులకు, సాహసికులకు స్వర్గధామమే గానీ, మహిళలకు మాత్రం అక్కడ ఇసుమంత కూడా రక్షణ లేదంటూ అమెరికాలోని చికాగో యూనివర్సిటీ నుంచి దక్షిణాసియా వ్యవహారాలపై పరిశోధన కోసం మన దేశానికి వచ్చిన మైఖేలా క్రాస్ అనే అమెరికన్ అమ్మాయి చెప్పిన విషయాలు అక్షర సత్యాలని రుజువైంది. అడుగడుగునా లైంగిక వేధింపులు, ఎక్కడ పడితే అక్కడ తడమడం లాంటి దారుణాలు అక్కడ ఉన్నాయని ఆమె వాపోయింది. రెండు రోజుల వ్యవధిలో ఏకంగా మూడుసార్లు ఆమెపై అత్యాచారం చేసేందుకు కొంతమంది ప్రయత్నించడం ఇక్కడి మహిళల భద్రత పరిస్థితికి పరాకాష్ఠ.
తన పరిశోధనలో భాగంగా మహారాష్ట్రకు రెండో రాజధాని లాంటి పుణె నగరానికి వెళ్లిన ఆమెకు అత్యంత చేదు అనుభవాలు ఎదురయ్యాయి. అక్కడి బజారులో ఉన్న అందమైన చీరలు చాలా తక్కువ ధరకే దొరికినా, అక్కడి మగాళ్లు తమనే చూస్తూ నిలుచున్నారని, తమను కావాలని తోసేస్తూ.. చేతులతో చెప్పరాని చోట్లల్లా నొక్కారని క్రాస్ వాపోయింది. భారతదేశంలో ఆడాళ్లు ఎలా బతుకుతున్నారోనంటూ ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. దీని గురించి ఆమె సీఎన్ఎన్ ఐరిపోర్ట్లో రాసిన కథనాన్ని కేవలం రెండు మూడు రోజుల్లోనే దాదాపు ఎనిమిది లక్షల మందికి పైగా చదివారు.
ముంబై ఫొటోగ్రాఫర్‌పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన దుండగుల ఊహా చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఆమెతో పాటు ఉన్న అసిస్టెంట్ చెప్పిన వివరాల ఆధారంగా వీటిని రూపొందించారు. అయితే, వీటివల్ల ఎంత ప్రయోజనం ఉంటుందో, నిందితులను అసలు పట్టుకునే అవకాశం ఉంటుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి. అండర్ వరల్డ్ కార్యకలాపాలకు అడ్డాగా ఉన్న ముంబై మహానగరంలో శక్తి మిల్స్ లాంటి ప్రాంతాలు కోకొల్లలు. ఇప్పుడంటే ఓ సంఘటన జరిగి, దాని వివరాలు బయటకు వచ్చాయి గానీ... ఇంతవరకు అలాంటిచోట్ల జరిగిన మిగిలిన సంఘటనలు ఇంకెన్ని వెలుగుచూడకుండా మిగిలిపోయాయో! సాక్షాత్తు దేశ ఆర్థిక రాజధానిలోనే ఇలాంటి పరిస్థితి ఉందంటే, ఇక బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి ప్రాంతాల గురించి ఇక చెప్పుకోనక్కర్లేదు. నిర్భయ లాంటి కఠినమైన చట్టాలున్నా, అవి నేరస్థులకు, కలవారికి చుట్టాలుగానే మిగిలిపోతున్నాయి తప్ప.. దోషులను శిక్షించడానికి ఉపయోగపడట్లేదు. ఈ పరిస్థితి ఇంకెన్నటికి మారుతుందో, నారీమణులను నిజంగా ఎప్పటికి పూజిస్తారో మరి!!