మరో ప్రస్థానానికి ‘మహా’ పిడికిళ్లు
కొత్త కోణం
పది రోజుల పాటు యాభై వేల మంది రైతులు,ఆదివాసీలు సాగించిన ఈ మహాపాదయాత్ర ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటనకూ తావులేకుండా మండేఎండలో మట్టికాళ్ళతో సుదీర్ఘంగా సాగి ముంబై నగరాన్ని పునీతం చేసింది. వారి నిబద్ధత ముందు మండే సూరీడు సైతం చిన్నబోయాడు. పట్టణ ప్రజలంతా వారి పోరాట పటిమకు సలామ్ కొట్టారు. అన్నం పెట్టారు. నీళ్ళిచ్చారు. తమ గుండెల్లో ఇంత జాగా ఇచ్చారు. నిజానికి వారికేదైనా అయితే ప్రాణం పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇది ఉద్యమ ప్రేమికుల గుండెల్లో ఉద్వేగాన్ని నింపింది.
‘‘ఈ దేశం ఎవరిదిరా ఈ దేశం మనదేరా
దుక్కిని దున్నే రైతుది, మొక్కను నాటే కూలిది
ఇన్లోగోంకా జైత్రయాత్ర
చలా జా రహాహై చలో’’
ముంబై పురవీధుల్లో కదంతొక్కిన మహారాష్ట్ర రైతన్నల నెత్తుటిధారలతో పరవశించిన పాదధూళి ఇప్పుడు ప్రపంచ ప్రజల మదిలో ఆశలు రేకెత్తిం చింది. యావత్ భారత దేశంలో మిణుకు మిణుకుమంటోన్న ఉద్యమ స్ఫూర్తి, మట్టిబిడ్డల నెత్తుటి బొబ్బల సాక్షిగా మళ్ళీ ప్రాణం పోసుకుంది. ఆనాడు చైనాలో మావో సే టుంగ్ నేతృత్వంలో శ్రామిక జనవిముక్తికోసం జనసం ద్రమై తరలిన లాంగ్ మార్చ్‌ని తలపించే అన్నదాతల పదఘట్టనలవి. మహా రాష్ట్రనే కాదు యావత్ భారత దేశాన్నీ కుదిపేస్తూ, వెల్లువలా తరలి వచ్చిన రైతాంగం ఉప్పొంగిన మహా జనసంద్రంలా మారింది. పేదలకూ, ఆది వాసులకూ, అణచబడ్డవారికీ అది పోరాడే శక్తినిచ్చింది. మన దేశంలోనే కాదు ప్రపంచప్రజలకూ నూతనోత్తేజాన్నిచ్చింది. ప్రాణమున్న ప్రతిమనిషిలో ఉద్యమ సత్తువ నింపగల శక్తి మహారాష్ట్ర రైతన్నల పాదముద్రలకుంది. అంతే కాదు. ఎక్కడో లెనిన్ విగ్రహాలు కూల్చేసో, లేక అంబేడ్కర్ విగ్రహాలను పడ దోసో అంతా అయిపోయిందని చంకలుగుద్దుకుంటోన్న వర్గాలకిది కనువిప్పు కలిగించింది. సరిగ్గా అదే మహారాష్ట్ర ప్రభుత్వానికీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల న్నింటికీ ఒక బలమైన హెచ్చరికను జారీచేసింది.
మహా పాదయాత్రకు ముంబై నీరాజనం
పది రోజుల పాటు యాభై వేల మంది రైతులు సాగించిన ఈ మహాపాద యాత్ర ఎక్కడా చిన్న అవాంఛనీయ సంఘటనలకు కానీ, హింసాత్మక ఘట నలకు కానీ తావులేకుండా మండేఎండలో మట్టికాళ్ళతో సుదీర్ఘంగా సాగి ముంబై నగరాన్ని పునీతం చేసింది. వారి నిబద్ధత ముందు మండే సూరీడు సైతం చిన్నబోయాడు. పట్టణ ప్రజలంతా వారి పోరాట పటిమకు సలామ్ కొట్టారు. అన్నం పెట్టారు. నీళ్ళిచ్చారు. తమ గుండెల్లో ఇంత జాగా ఇచ్చారు. నిజానికి వారికేదైనా అయితే ప్రాణం పెట్టేందుకు సిద్ధపడ్డారు. ఇది ఉద్యమ ప్రేమికుల గుండెల్లో ఉద్వేగాన్ని నింపింది. ఈ ప్రదర్శనకు నాయకత్వం వహించిన సిపిఐ(ఎం) అనుబంధ సంస్థ అఖిలభారత కిసాన్ సభ మొక్క వోని దీక్ష , ఉద్యమ సమర్ధత ప్రజల నీరాజనాలందుకుంది.
నాసిక్ నుంచి ప్రారంభమైన ఈ జైత్రయాత్ర 180 కిలోమీటర్ల దూరం సాగింది. మధ్యలో థానే జిల్లాలో రైతులను, ఆదివాసులను తనలో కలుపు కొని ముందుకురికింది. ఇది కేవలం సాధారణ గ్రామాల్లో ఉండే రైతాంగ వెల్లువ మాత్రమే కాదు. నాసిక్, థానే జిల్లాల్లో రగులుకున్న ఆదివాసీ కోపాగ్ని సెగలు ఇందులో భాగమయ్యాయి. ఈ జైత్రయాత్రలో పదం పదం కలిపిన వారిలో మూడు వంతుల ప్రదర్శకులు ఆదివాసీలేనంటే ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఆడ, మగ, తేడా లేకుండా బొబ్బలెక్కినా, రక్తాలు కారుతున్నా లెక్క చేయని సాహసం ఆదివాసీలకే చెల్లు. దారిపొడవునా, రాళ్ళూ రప్పలపై తల లువాల్చి, కటికనేలపైనే పడుకొని పట్టుదలగా సాగిన ఈ అన్నదాతల చరిత మరుపురానిది, మరువలేనిది. నాసిక్‌లో ఆదివాసీల జనాభా 25.61 శాతం కాగా, థానేలో 13.9 శాతం. దేశంలో రైతాంగం యావత్తు ఎదుర్కొంటోన్న సమస్యలతో పాటు, ప్రత్యేకించి ఆదివాసీలను అడవినుంచి దూరంచేసే ప్రయత్నాలు కూడా వారిలో ఆగ్రహాన్ని తెప్పించాయి.
రెక్కలు ముక్కలు చేసుకొనే శారీరక శ్రమపై ఆధారపడి, నేలనే నమ్ము కున్న ఆదివాసీల భూమి సమస్య ఈ యాత్రలో ప్రముఖంగా నిలిచింది. ఈ ప్రదర్శన ప్రధానంగా పది డిమాండ్లను ప్రభుత్వాల చెవిని సోకేలా నిన దించింది. అసలు ఇంత ఉవ్వెత్తున రైతాంగం ఉప్పెనలా కదలడానికి తక్షణ కారణం అభివృద్ధి పేరిట వారి భూములను కొల్లగొడుతోన్న వ్యవహారం. ముఖ్యంగా బుల్లెట్ ట్రైన్‌కోసం భూమి సేకరణ పేరుతో, నదుల అనుసం ధానం పేరుతో భూమిని స్వా«ధీనం చేసుకోవడంతో ఈ రెండు జిల్లాల రైతులు వేలాది ఎకరాల భూమిని కోల్పోయారు. తమ రక్తాన్ని చెమటగా మార్చడం తప్ప మరో లోకం లేని శ్రమజీవులకు మట్టితో ఉన్న అనుబంధం కడుపు రగిలేలా చేసింది. దీనితో పాటు వ్యవసాయం పూర్తిగా దెబ్బతిని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్యలకు పాల్పడుతోన్న రైతాంగాన్ని నిరాశతో కుంగిపోకుండా ఉద్యమబాటలో నడిపించిన ఘనత అఖిలభారత కిసాన్ సభకు దక్కుతుంది.
బుల్లెట్ ట్రైన్లు కాదు బువ్వ పెట్టే భూమి ముఖ్యం
బేషరతుగా రైతుల రుణాలను రద్దు చేయాలన్నది ఉద్యమకారుల పది డిమాండ్లలో తొలి డిమాండ్. గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అప్పులను రద్దు చేసింది. కానీ చాలామంది రైతులకు ఆ ప్రయోజనం చేకూరలేదు. ఎందు కంటే గ్రామాల్లో ఉన్న చాలామంది వ్యవసాయదారులు కౌలుదారులుగా ఉన్నారు. కౌలుదారులకు ఈ దేశంలో ఏ హక్కూ లేదన్నది నిర్వివాదాంశం. అదేవిధంగా ఆదివాసీ ప్రాంతాల్లో చాలామంది ఆదివాసీ రైతులకు భూమి పట్టాలు లేవు. ప్రభుత్వాలు భూమి ఇచ్చినట్టు లెక్కలు రాసుకున్నా వారికి వారి భూములపై హక్కు లేదు. దానికి సంబంధించిన పథకాలేమీ వర్తించవు. ఇది కూడా వారి ఆగ్రహానికి కారణం. రెండో విషయం వ్యవసాయ రంగ సమ స్యల అధ్యయనంపై 2004లో వేసిన స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనేది. ప్రతి రైతుకు పంట మీద వెచ్చించే ఖర్చుకు ఒకటిన్నర రెట్లు అధికంగా మద్దతుధర ఇవ్వాలనేది వీరి డిమాండ్‌లో ప్రధాన విషయం. ఇక మూడో అంశం.. ఆదివాసీల సాగు భూములపై వాళ్ళకు అధికారం కల్పిం చేందుకు వారిపేరున పట్టాలివ్వాలని, అటవీ సంరక్షణ చట్టాన్ని సమర్థవం తంగా అమలు చేయాలని తద్వారా ఆదివాసేతరులు ఆదివాసీల భూము ల్లోకి రాకుండా ఆపాలనేది ఇందులో కీలకం. నాల్గవ డిమాండ్ బలవంతంగా రైతుల భూములను, సూపర్ హైవేల కోసమో, బుల్లెట్ రైళ్ళ కోసమో స్వాధీ నం చేసుకోకూడదనీ, అదేవిధంగా గుజరాత్‌కు మహారాష్ట్ర నుంచి నీళ్ళివ్వ కూడదనేది కూడా ఒక ప్రధానమైన డిమాండ్‌గా ముందుకొచ్చింది.
ఈ సమస్యలకు తోడు ఆదివాసీలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు వారిలో కోపాగ్నులు రగిల్చాయి. నాసిక్ జిల్లాలో ఉన్న ఆదివాసీలు పౌష్టికా హారలో పంతో చాలామంది మృత్యువాత పడుతున్నట్టు లెక్కలు చెబుతు న్నాయి. ఏటా 20 వేల మందిదాకా అయిదేళ్ళలోపు చిన్నారులు చనిపోతు న్నట్టు ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో ఒకరైన సీపీఎం అను బంధ సంస్థ అఖిల భారత కిసాన్ సభ జాతీయ కార్యదర్శి విజూక్రిష్ణన్ తెలి పారు. వ్యవసాయ సంక్షోభం కేవలం పంటలకు పరిమితం కాదనేది వాస్త వం. సమాజంలోని అన్ని అంశాలపైనా, జీవితంలోని అన్ని రంగాలపైనా దాని ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు తేల్చారు. అదే నాసిక్‌లో జరిగింది.
ప్రపంచ చరిత్రలో కూడా ఇటువంటి ఉద్యమాలు జరిగిన అనుభవం ఉంది. మహత్తర చైనా విప్లవంలో వందల కిలోమీటర్లు నడిచి, తినడానికి తిండి లేకపోతే కాలిచెప్పులను ఉడకబెట్టుకుతిని కూడా లాంగ్ మార్చ్‌ని కొన సాగించిన మహాసంగ్రామమది. ఇందులో లక్షలాది మంది చనిపోయినట్టు చరిత్ర చెబుతోంది. మూడు లక్షల మందితో ప్రారంభమైన ఎర్ర సైన్యంలో కేవలం 30 వేలమంది మాత్రమే చివరకు మిగిలారు. ఆ తర్వాత చెప్పుకో దగింది ఐర్లాండ్ రైతుల జైత్రయాత్ర. అమెరికా మానవ హక్కులనేత మార్టిన్ లూథర్ కింగ్ స్ఫూర్తితో 1966లో ఐర్లాండ్ జాతీయ రైతు సంఘం నాయ కత్వంలో 26 మందితో ప్రారంభమైన రైతుల జైత్రయాత్ర 217 మైళ్ళు సాగింది. కేవలం 16 మంది రైతులతో ప్రారంభమై 30వేల మందితో ముగిసింది.
మరో మహోన్నత జైత్రయాత్ర ఇటీవల బ్రెజిల్ జరిగింది. 1985లో ఒక భూస్వామికి చెందిన 9వేల ఎకరాల భూమిని భూమిలేని నిరుపేదలు ఆక్ర మించుకున్నారు. భూస్వామి మనుషులు కాల్పులు జరుపుతున్నా చలించని పేదలు వారిని తరిమేసి, ఆ విజయ స్ఫూర్తితో దేశ రాజధాని పోర్ట్ అలెగ్రెకి జైత్రయాత్ర సాగించాలని నిర్ణయించుకున్నారు. 1986లో 300 కిలోమీటర్ల దీర్ఘయాత్రను 300 మందితో మొదలుపెట్టారు. ఆ యాత్ర ముగిసేనాటికి వారితో పదం పదం కలిపి కదం తొక్కిన రైతులు 40 వేలకు పైచిలుకే. ఇంత ఉవ్వెత్తున సాగిన జైత్రయాత్రకు ప్రభుత్వం స్పందించకున్నా, పోలీసు కాల్పుల్లో నలుగురు చనిపోయినా ప్రజల్లో పోరాట పటిమ తగ్గలేదు. అంతి మంగా ప్రజలకే ఆ 9 వేల ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పగించక తప్పలేదు.
రైతుల నెత్తుటి కాళ్లకు పరిష్కారం
రైతు ఎదుర్కొంటున్న నష్టాలు, సరైన ధరలు లభించకపోవడమనేది ప్రధాన మైన సమస్యగా ముందుకు వస్తున్నది. రైతు పండించే ఏ పంటైనా సరే సరైన ప్రయోజనం అందించడం లేదు. దీనికి ప్రధాన కారణం రైతుకు, వినియోగ దారునికి మధ్య ఉన్న దళారి వ్యవస్థ ప్రధానమైన అడ్డంకి. అది వరి కావచ్చు. కూరగాయలు కావచ్చు. ఇతర ఏరకమైన పండ్లు, లేదా ఇతర వ్యవసాయోత్ప త్తులు ఏవైనా కావచ్చు. రైతు అమ్మేధరకు వినియోగదారుడు అందుకుంటున్న ధరకూ మధ్యనున్న వ్యత్యాసం చాలా ఎక్కువ. రైతు అమ్మే ఒక వస్తువుకి ఒక రేటు అయితే, వినియోగదారుడికి చేరేసరికి ఒక్కొక్కసారి పదుల రెట్లు ధర పెరిగిపోతోంది. ఇది మారాలి. దీనికి ఒక పరిష్కారం, రైతులే తాము పండిం చిన ఉత్పత్తులను నేరుగా తామే అమ్ముకునే వ్యవస్థ ద్వారా సాధ్యమౌతుంది. వ్యవసాయానుబంధ ఉత్పత్తులను మార్కెట్‌కనుగుణంగా వినియోగంలోనికి తేవడం కూడా అందుకు ఒక పరిష్కారంగా చూడొచ్చు. ఇటువంటి ప్రయ త్నాలు కొన్ని అక్కడక్కడా జరుగుతున్నప్పటికీ ఫలితాలు అంతగా సమకూ రడం లేదు. అదేవిధంగా నగరనిర్మాణం, రోడ్లు, ఇతర పెట్టుబడిదారుల పరి శ్రమల కోసం ప్రభుత్వాలు, ప్రైవేట్ కంపెనీలు అడవులు మీద కన్నేశాయి. ఆదివాసీల వనరులను కొల్లగొట్టాలని చూస్తున్నాయి. దీనితో ఆదివాసులు మరింత దీనస్థితికి చేరుతున్నారు. గూడులేని పక్షుల్లా చెట్టుకొకరు, పుట్టకొ కరుగా చెల్లాచెదురౌతున్నారు. ఈ విషయాలే మహారాష్ట్ర రైతులను, ప్రత్యే కించి ఆదివాసీలను నెత్తుటి ధారలుగా నడిపించాయి. ఇప్పటికైనా ప్రభు త్వాలు ఈ వాస్తవాలన్నింటినీ గమనించి నిర్దిష్టమైన విధానాలను రూపొం దించి, అమలు చేసే చిత్తశుద్ధిని కనపరచాలి. అప్పుడు మాత్రమే రైతుల కోపాగ్ని చల్లారుతుంది. లేదంటే అది మరింత కసితో ఎగిసిపడే అగ్నిజ్వాలగా మారుతుంది. రైతాంగ సమస్యలకు పరిష్కారం దొరికేవరకు మహారాష్ట్ర రైత న్నలు తమ హక్కుల కోసం పరిచిన నెత్తుటి తివాచీ దేశంలోని ప్రతిరైతు గుండెలోనూ పచ్చిగానే ఉంటుందన్నది ప్రభుత్వాలు గుర్తించాలి.
మల్లేపల్లి లక్ష్మయ్య
వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్ : 97055 66213