మూడేళ్లలో ప్రపంచస్థాయి రోడ్లు
సాక్షి, ముంబై: వచ్చే మూడేళ్లలో ముంబై రహదారుల రూపురేఖలు మారనున్నాయి. నగరంలో ప్రపంచ స్థాయిలో (వరల్డ్ క్లాస్) నాణ్యమైన రహదారులు నిర్మించేందుకు మహానగర పాలక సంస్థ (బీఎంసీ) రూ. ఏడున్నర వేల కోట్లతో ‘రోడ్ మాస్టర్ ప్లాన్’ తయారు చేసింది. ఏటా వర్షా కాలంలో రోడ్లపై ఏర్పడిన గుంతలతో ప్రజలు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దీంతో ఈ ఇబ్బందుల నుంచి ముంబైకర్లకు విముక్తి కల్పించాలని బీఎంసీ మాస్టర్ ప్లాన్ తయారుచేసినట్లు మేయర్ సునీల్ ప్రభు చెప్పారు. ‘ముంబై రోడ్స్ మాస్టర్ ప్లాన్’ అనే పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమానికి బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే, డిప్యూటీ మేయర్ మోహన్ మిట్భావ్కర్, సభాగృహం నాయకుడు తృష్ణ విశ్వాస్రావ్, స్థాయీ సమితి అధ్యక్షుడు యశోధర్ ఫణసే తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ కుంటే మాట్లాడుతూ రోడ్ల మరమ్మతులకు బీఎంసీ ఏటా కొన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా వర్షా కాలంలో అవి అధ్వానంగా మారిపోతున్నాయన్నారు. దీంతో పటిష్టమైన రహదారులు నిర్మించాలని నిర్ణయించినట్లు చెప్పారు.
కాగా, మూడేళ్ల కాలపరిమితిలో ఈ పనులు ఎలా చేపట్టాలి, ఎన్ని విడతల్లో పూర్తి చేయాలి తదితర ఈ పుస్తకంలో పొందుపర్చామన్నారు. ఇదిలాఉండగా పటిష్టమైన రోడ్లు నిర్మించేందుకు ఆర్థిక బడ్జెట్లో రూ.7500 కోట్లు మంజూరు చేశారు. ఆ ప్రకారం ఏటా రూ.2500 కోట్లు ఖర్చుచేసి సీసీ రోడ్లు, మాస్టిక్ అసఫల్ట్ రసాయనంతో పటిష్టమైన రహదారులు నిర్మించాలని సంకల్పించారు. టెండర్లను ఆహ్వానించకుండా ఏటా నగర రహదారులపై అధ్యయనం చేస్తారు. ఏ రోడ్డును, ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలి ప్రణాళిక రూపొందించి ఆ ప్రకారం విడతల వారీగా పనులు చేపడతారని కుంటే వివరించారు.